ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ ప్రవేశాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలను అడ్డుకోవాలని చూస్తున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆన్‌లైన్‌ ప్రవేశాలపై కొన్ని కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయని, కోర్టు తీర్పు ఆధారంగా ముందుకెళ్తామన్నారు. ఈ ఏడాది 6.30 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, ఇంటర్‌లో 5-6 లక్షల మంది ప్రవేశాలు పొందుతారన్నారు. సీట్ల కోసం కొత్తగా 300 కళాశాలలకు అనుమతులిచ్చామని, పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని విద్యా సంస్థలు సర్కారు సూచనలు, ఆదేశాలను పాటించాలని ఉద్ఘాటించారు. కొన్ని కళాశాలలు రేకులషెడ్లు, వాణిజ్య భవనాలు, అగ్నిమాపక ధ్రువపత్రాల్లేకుండా నిర్వహిస్తూ పట్టించుకోకూడదని అనడం సరికాదన్నారు. ఆకస్మికంగా ఆదేశాలిచ్చారు.. సమయం కావాలని యాజమాన్యాలు కోరడంతో ఏడాది పాటు వెసులుబాటు కల్పించామని తెలిపారు.





ఇంటర్మీడియట్‌ బోధన ఫీజులపై పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాలు పాటించాలని, ఐఐటీ, జేఈఈ అంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మంత్రి సురేశ్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ఒక్కో సెక్షన్‌కు అనుమతించే విద్యార్థుల సంఖ్యను 88 నుంచి 40కి తగ్గించడాన్ని ప్రైవేటు యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేయడంతో ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో జాప్యం నెలకొంది. ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు, అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి ముందస్తు ఆదేశాలుగానీ, మార్గదర్శకాలుగానీ ప్రభుత్వం జారీ చేయలేదని పిటిషనర్లు ఆరోపించారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది ఆప్షన్స్ ఇచ్చారు. వాస్తవానికి ఏటా 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్2లో చేరుతారు. ఈ లెక్కన మరో రెండు లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌కు దూరంగానే ఉన్నారు. కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో తరగతుల పునఃప్రారంభం వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: