ఒడిశా పాఠశాల విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ మాట్లాడుతూ విద్యార్థులకు పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కెరీర్, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు, స్కాలర్‌షిప్ ఇలా మొత్తం సమాచారాన్ని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పోర్టల్‌లో దాదాపు 550కిపైగా కెరీర్ మార్గాలపై సమాచారం ఉందని, ఈ పోర్టల్ ద్వారా 17వేలకు పైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల వివరాలను, ఒడిశాతో పాటు దేశంలోని వృత్తి సంస్థల సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు.
ఇందులో 2లక్షల 62వేలకు పైగా విద్యార్థుల వివరాలనూ పొందుపరిచామని వివరించారు. దేశ వ్యాప్తంగా జరిగే 1,150 పోటీ పరీక్షల వివరాలు, వాటికి దరఖాస్తు చేసుకోనే వివరాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఈ పోర్టల్ ఉంచినట్లు వెల్లడించారు. భారత్‌తో పాటు విదేశాల్లోని ఉన్నత విద్య కోసం ఉన్న 1,120 స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
యూనిసెఫ్ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఈ కెరీర్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీంతో విద్యార్థులు కెరీర్‌కు సంబంధించి ఎలాంటి అవకాశాలున్నాయో తెలుసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు తమ కెరీర్‌కు సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా ఉపాధ్యాయులతో నేరుగా చర్చించే అవకాశం కూడా ఈ పోర్టల్ ద్వారా కల్పించినట్లు చెబుతోంది. ఈ పోర్టల్‌ను ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను కూడా రూపొందించామని తద్వారా విద్యార్థులు దీనిని వినియోగించడం సులువవుతుందని చెబుతోంది.
www.odishacareerportal.com వెబ్‌సైట్‌లోకి లాగినై వివరాలను తెలుసుకోవచ్చని, దీనికోసం ఓ ప్రత్యేకమైన ఐడీ, పాస్‌వర్డ్ ఉంటాయని, వాటిని నమోదు చేసి సేవలను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. విద్యార్థుల సౌకర్యార్థం సమాచారం ఇంగ్లిష్‌తో పాటు ఒరియాలోనూ అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పేర్కొంది. ఈ కెరీర్ పోర్టల్ గురించి యూనిసెఫ్ చీఫ్ ఫీల్డ్ ఆఫీస్ మోనికా నీల్సన్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు రాష్ట్రంలోని సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యార్థులకు ఈ కెరీర్ పోర్టల్ చక్కగా సహకరిస్తుందని చెప్పారు.