
వివిధ శాస్త్ర గ్రంథాల ప్రకారం భారతీయ సంస్కృతిలో 64 కళలు - విద్యలు ఉన్నాయి. వాటినే చతుషష్టి కళలను తెలియజేసే శ్లోకం :"వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే”
నందమూరి తారక రామారావు, (తాడేపల్లి లక్ష్మి) కాంతారావు, రామకృష్ణ తదితర కథానాయకులు నటించిన తెలుగు జానపద సినిమాల్లో కథానాయకులు సాధారణంగా సకళకళా ప్రవీణులుగా పేరొంది ఉంటారు. అంటే మన సంస్కృతి ప్రకారం వారికి 64 కళల్లో ప్రవేశం ఉందని అర్ధం. అసలు 64 కళల పేర్లేమిటో చూద్దాం.
వేదములు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము - అని నాల్గు
వేదాంగములు: శిక్షలు, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పములు అని ఆరు శాస్త్రములు
ఇతిహాసములు: రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు
ఆగమశాస్త్రములు: శైవాగమము, పాంచరాత్రాగమము, వైఖానసాగమము ,స్మార్తాగమము అని నాలుగు .
న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు
కావ్యాలంకారములు: సాహిత్యశాస్త్రము
నాటకములు:
గానము: సంగీతం
కవిత్వము: ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము
కామశాస్త్రము:
ద్యూతము: జూదమాడడము: జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమి నాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,
దేశభాషాజ్ఞానం:
లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయు విధానము.
వాచకము: ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు
సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము
స్వరశాస్త్రము: ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభా శుభ ఫలబోధకమైన శాస్త్రము,
శకునము: ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము
సాముద్రికము: హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము
రత్నపరీక్ష: నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం
స్వర్ణపరీక్ష: బంగారమును గుర్తించు జ్ఞానము
అశ్వలక్షణము: గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము
గజలక్షణము: ఏనుగులకు సంబంధించిన జ్ఞానము
మల్లవిద్య: కుస్తీలు పట్టు విధానము
పాకకర్మ: వంటలు
దోహళము: వృక్షశాస్త్రము
గంధవాదము: వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారు చేయు నేర్పు
ధాతువాదము: రసాయన వస్తువులు నెరుంగు విద్య
ఖనీవాద: గనులు వాటి శాస్త్రం .
రసవాదము: పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.
అగ్నిస్తంభన: అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.
జలస్తంభన: నీళ్ళను గడ్డ గట్టించి, నందులో మెలంగుట.
వాయుస్తంభన: గాలిలో తేలియాడు విద్య
ఖడ్గస్తంభన: శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య
వశ్యము: పరులను, లోబచుకొను విద్య
ఆకర్షణము: పరులను, చేర్చుకొను విద్య,
మోహనము: పరులను మోహింపజేయు తెరంగు.
విద్వేషణము: పరులకు విరోదము కల్పించడము,
ఉచ్ఛాటనము: పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,
మారణము: పరులకు ప్రాణహాని గల్గించడము.
కాలవంచనము: కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.
వాణిజ్యము: వ్యాపారాదులు.
పాశుపాల్యము: పశువులను పెంచడములో నేర్పు.
కృషి: వ్యవసాయ నేర్పు.
ఆసవకర్మ: ఆసవములను, మందులను చేయు రీతి
లాపుకర్మ: పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.
యుద్ధము: యుద్ధముచేయు నేర్పు.
మృగయా: వేటాడు నేర్పు
రతికళాకౌశలము: శృంగార కార్యములలో నేర్పు.
అద్మశ్యకరణీ: పరులకు కానరాని రితిని మెలంగడము.
ద్యూతకరణీ: రాయబార కార్యములలో నేర్పు.
చిత్ర: చిత్రకళ
లోహా: పాత్రలు చేయి నేర్పు
పాషాణ: రాళ్ళు చెక్కడము, శిల్పకళ.
మృత్: మట్టితొ చేయు పనులలో నేర్పు
దారు: చెక్కపని
వేళు: వెదరుతో చేయు పనులు
చర్మ: తోళ్ళ పరిశ్రమ.
అంబర: వస్త్ర పరిశ్రమ
చౌర్య: దొంగతనము చేయుటలో నేర్పు
ఓషథసిద్ధి: మూలికలద్వారా కార్యసాధనావిధానము
మంత్రసిద్ధి: మంత్రములద్వారా కార్యసాధనము
స్వరవంచనా: కంఠధ్వనివల్ల ఆకర్షణము
దృష్టివంచన: అంజనవంచన, చూపులతో ఆకర్షణము
పాదుకాసిద్ధి: ఇంద్రజాల మహేంద్రజాలములు - తలచినచోటికి ఇంద్రజాలములనెడు
గారడీవిద్య
ఈ 64 కళల్లో ఆరితేరిన వారు చరిత్రలో విక్రమార్క చక్రవర్తి మరియు ఆయన మంత్రి భట్టి.