దేశ వ్యాప్తంగా వచ్చే నెల 12వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు తగిన అన్ని మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు జారీ చేసింది. ఈ నెల 6న నీట్ కు దరఖాస్తు గడువు ముగిసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో... నీట్ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ... ఎన్.టీ.ఏ. అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్ కేసులు తగ్గుతుండంతో వచ్చే నెల 12వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనుంది ఎన్.టీ.ఏ. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ నీట్ పరీక్ష  నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ఎన్.టీ.ఏ. అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని... అది లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని కూడా స్పష్టం చేశారు. అలాగే వాటర్ బాటిల్ తో పాటు ఓ చిన్న శానిటైజర్ బాటిల్ కూడా పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు కేంద్రం అనుమతించింది.

ఈ ఏడాది మొత్తం 11 భాషల్లో నీట్ పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు... తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫోటోతో పాటు... పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు లాంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు ఖచ్చితంగా సాధారణ చెప్పులు మాత్రమే వేసుకోవాలి. బూట్లు వేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఎలాంటి ఆభరణాలకు కూడా అనుమతి లేదు.పర్సులు, కళ్లద్దాలు, హ్యాండ్ బ్యాంగులు, హెయిర్ పిన్నులు, బ్యాండ్లు, తాయెత్తులతో వస్తే మాత్రం బయటే ఆపేస్తారు. ఇక ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా విద్యార్థులు తీసుకురాకూడదు. సెల్ ఫోన్, బ్లూ టూత్, రిస్ట్ వాచ్ సహా ఎలాంటి పరికరాలకు కూడా అనుమతి లేదు. ఇక ఆన్సర్ షీట్ ను చింపినా నేరమే. అలాగే అడ్మిషన్ కార్డును ట్యాంపరింగ్ చేసినట్లు రుజువైతే... మూడేళ్ల పాటు డిబార్ చేస్తారు. శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఇక చివరి నిమిషం గందరగోళం నుంచి విద్యార్థులను తప్పించేందుకు... గంట ముందే పరీక్ష లోనికి అనుమతిస్తున్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని ఎన్.టీ.ఏ. అధికారులు స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఎంట్రన్స్ కోసం నీట్ పరీక్షను కేంద్రం నిర్వహిస్తోంది. నీట్ లో మార్కులను బట్టి మెడికల్ సీట్ వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: