ఒకపక్క వాక్సినేషన్ మరోపక్క కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశంలో పూర్వపు పరిస్థితులు నెలకొంటున్నాయి. సంస్థలు కూడా వారి కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అయినా ఇంకొన్నాళ్ళు కరోనా జాగర్తలు పాటిస్తూనే అందరు తమతమ పనులు చేసుకోవాల్సి ఉంటుందని వైద్యశాఖ సూచిస్తుంది. తద్వారా మరోసారి అత్యవసర పరిస్థితి వరకు తెచ్చుకోవాల్సిన పని ఉండబోదని తెలిపింది. దీనిని గ్రహించిన సంస్థలు కనీసం తరువాతి ఏడాది కైనా ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని చూస్తున్నాయి. ఇప్పటి నుండే వచ్చే ఏడాదికి సిద్ధం అవుతున్నాయి.
తద్వారా రానున్న ఏడాదిలో ఆయా సంస్థలలో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సంస్థలు భారీగా ఉద్యోగులను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయా దిగ్గజ సంస్థలు ఇప్పటికే భారీ ఉద్యోగాల కల్పన సంఖ్యను కూడా ప్రకటించాయి. అందులో కాగ్నిజంట్ రానున్న ఏడాదిలో 45000 ఉద్యోగులను భర్తీ చేసుకోనున్నట్టు ప్రకటించింది. పిడబ్ల్యూసి కూడా తమ నియామకాలను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. గోల్డ్ మాన్ శాక్స్, ఇన్ఫోసిస్ సంస్థలు కూడా గత ఏడాది కంటే వచ్చే ఏడాది నియామకాలను ఎక్కువగా చేసుకోనున్నట్టు తెలిపాయి. ఈ నియామకాలు ఎక్కువ మొత్తం క్యాంపస్ లేదా క్యాంపస్ యేతర పద్దతులలో జరుగనున్నాయి. ఐటీ మరియు ఐటి యేతర సంస్థలు కూడా వచ్చే ఏడాది భారీగానే నియామకాలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. బైజూస్, టిసిఎస్, టాటా స్టీల్ సంస్థలు కూడా నియామకాలు అధికంగానే చేస్తున్నట్టు చెపుతున్నాయి.