రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు జరిగిన పరీక్షల్లో 4 లక్షల 59 వేల మంది పరీక్షలు రాశారు. ఇందులో దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరి ఫెయిల్యూర్‌కి రకరకాల కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తీర్ణత శాతం 50కి లోపే ఉండటంతో ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు వేయాలని భావిస్తోంది. అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి ఆన్‌లైన్ తరగతులే కారణమన్న చర్చ కూడా ఉంది. పదవ తరగతి పరీక్ష రద్దు చేసి నేరుగా అందరినీ పాస్ చేయడం మరో కారణం అంటున్నారు. ప్రిపరేషన్‌కు గడువు ఇవ్వకపోవడం కూడా దెబ్బతీసిందని ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు ప్రభుత్వం తీరుతో పాటు ఇంటర్ బోర్డు వైఖరిపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇంటర్ బోర్డు అధికారుల వైఫల్యం వల్లే తీవ్ర గందరగోళం నెలకొందని అంటున్నాయి. తక్షణమే సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే అని తేల్చి చెబుతున్నాయి. నాణ్యమైన విద్యను అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫెయిల్ అయిన వాళ్లకు సప్లిమెంటరీ రాసేందుకు పూర్తిగా ఫీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా ఆన్ లైన్ క్లాస్‌లను ఎత్తేసి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడం తప్ప.. మరో మార్గం లేదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. అందుకు తగ్గట్టే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.