
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ద్వారానే ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీ చేస్తారు. ఈ ఏడాది జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆన్ లైన్ ద్వారా నిర్వహించనున్నట్టు ఐఐటీ బాంబే తెలిపింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే విద్యార్థులు ఆ పరీక్షకు హాజరు కావచ్చు.. ఈ పరీక్ష కోం జూన్ 8 నుంచి 14 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను జులై 18న వెల్లడించనున్నట్టు ఐఐటీ బాంబే తెలిపింది. ఆ వెంటనే.. మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ కూడా మొదలవుతుంది.
ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. బాలికలకు మొత్తం ఐఐటీ సీట్లలో 20% కేటాయిస్తారు. ప్రతి ఐఐటీలో కనీసం 20 శాతం సీట్లను అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తామని ఐఐటీ బాంబే తెలిపింది. 2020, 2021లో అడ్వాన్స్‌డ్ రాసేందుకు పేరు నమోదు చేసుకొని పరీక్ష రాయని వారు నేరుగా జేఈఈ మెయిన్ రాయకుండానే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసుకోవచ్చు. ఇక అడ్వాన్స్‌డ్‌లో అర్హత మార్కులు సాధించిన వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ కోసం జులై 18, 19 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ పరీక్షను జులై 21న నిర్వహించి ఫలితాలను అదే నెల 24న వెల్లడిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం తెలంగాణలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే ఏపీ విషయానికి వస్తే.. అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.