తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫారాలు పెంచనున్నారు. ఇకపై మూడు జతల యూనిఫాంలను ఇవ్వాలని తెలంగాణ విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు  రెండు జతల యూనిఫాంలు ఇస్తున్నారు. దీన్ని మరో జత పెంచి మూడు జతలు ఇవ్వాలని నిర్ణయించారు.


అయితే గురుకులాల్లోని విద్యార్థులకు ఇప్పటికే మూడు జతల యూనిఫాంలు ఇస్తున్నారు. ఇప్పుడు మామూలు పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా మూడు జతల యూనిఫాంలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. తెలంగాణ సర్కారు ప్రతీ ఏటా రాష్ట్రంలోని విద్యార్థులకు యూనిఫాంలను ఉచితంగా అందజేస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్‌ పాఠశాల్లోని విద్యార్థులకు యూనిఫాంలు ఉచితంగా ఇస్తున్నారు.


మొత్తం 22 లక్షల విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యూనిఫారంల కోసం ఒక్కో యూనిఫాంకు రూ. 200 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇలా మొత్తం రూ. 100 కోట్లకు పైగా నిధులు యూనిఫారాల కోసం వెచ్చిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. టెస్కో సంస్థ ద్వారా టెరి కాటన్ వస్త్రాన్ని తెప్పించి ఈ యూనిఫారాలు సిద్ధం చేస్తున్నారు. ఈ బాధ్యతను స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలకు అప్పజెప్పారు.


స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలే యూనిఫారాలు కుట్టించి విద్యార్థులకు అందజేస్తున్నాయి. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా టెస్కో ద్వారానే వస్త్రాన్ని సేకరించేందుకు అధికారులు సిద్ధ మమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు ఆలోచిస్తోంది. ప్రత్యేకించి గురుకులాలు మంచి పేరు తెచ్చుకుంటున్న నేపథ్యంలో వాటిలో సౌకర్యాలు మరింతగా పెంచాలని భావిస్తోంది. తెలంగాణ గురుకులాల మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శింగా తీసుకుని తమ వద్ద కూడా అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: