ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగి అన్నీ చేతికి వచ్చాక ప్రతిఒక్కరూ యూట్యూబ్‌ను చూస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంకా తమకు కావాల్సిన విషయాల కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ ఆ వీడియోలను వీక్షిస్తూ టైంపాస్‌ చేయటమే కాకుండా ఎంటర్టైన్మెంట్‌ కూడా పొందుతున్నారు.మనకు నచ్చిన విషయం (టాపిక్‌) ఏదైనా సెలెక్ట్‌ చేసుకోవాలన్నా, దానిపై తేలిగ్గా, తొందరగా అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడు ఇదో చక్కని మార్గంగా మారింది. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌పై ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా, ఇంటరాక్టివ్‌గా అందించటం కోసం యూట్యూబ్‌ పనిచేస్తోంది.ఈ మేరకు త్వరలో యూట్యూబ్‌ ప్లేయర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ని అందుబాటులోకి తేనుంది. వ్యూయర్స్‌కి ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకునేందుకు అవకాశం కల్పించనుంది. విద్యార్థుల నిర్మాణాత్మక అభ్యసనం కోసం సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌లు ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌ని క్రియేట్‌ చేసేందుకు కూడా ఇందులో వీలుంటుంది. ఎడ్యుకేషనల్‌ ఎన్విరాన్‌మెంట్స్‌లో యూట్యూబ్‌ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తేనున్నట్లు ఇటీవల ప్రకటించింది. సాధారణంగా ఎడ్యుకేషన్‌ యాప్‌లలో లభించే స్టడీ మెటీరియల్‌నే ఈ యూట్యూబ్‌ ఎంబెడెడ్‌ ప్లేయర్‌లో నూతనంగా ప్రజెంట్‌ చేస్తారు.


మధ్య మధ్యలో యాడ్‌లు, ఎక్స్‌టర్నల్‌ లింక్‌లు, రికమండేషన్లు, నోటిఫికేషన్లు, అలర్టులు, అప్‌డేట్‌లు తదితర డిస్టర్బెన్స్‌ ఉండవు. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌ నోట్స్‌ని ప్రశాంతంగా చదువుకోవచ్చు. మెదడుకి మేతను అందించొచ్చు అని యూట్యూబ్‌ లెర్నింగ్‌ ప్రొడక్ట్‌ మేనేజ్మెంట్‌ డైరెక్టర్‌ జొనాథన్‌ క్యాట్జ్‌మ్యాన్‌ అన్నారు. యూట్యూబ్‌ లెర్నింగ్‌ ప్రొడక్ట్‌కి తుది మెరుగులు దిద్దేందుకు, సాధ్యమైనంత తొందరగా విడుదల చేసేందుకు విద్య, సాంకేతిక రంగంలో పాతుకుపోయిన ఎడ్‌టెక్‌ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటికే గూగుల్‌ క్లాస్‌రూమ్‌లో ఉన్న యూట్యూబ్‌ ఎంబెడెడ్‌ ప్లేయర్‌ని అప్‌డేట్‌ చేస్తామని చెప్పారు.క్వాలిఫైడ్‌ క్రియేటర్స్‌ వ్యూయర్స్‌ కోసం.. వచ్చే సంవత్సరం నుంచి ఫ్రీ కోర్సులను లేదా పెయిడ్‌ కోర్సులను చాలా క్లారిటీగా ప్రారంభించేందుకు ఏర్పాటుచేస్తామని ఆయన పేర్కొన్నారు. యూట్యూబ్‌ సంస్థ ఈ దిశగా ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీలైన ఎడ్‌పజిల్‌, పర్‌డ్యు యూనివర్సిటీ, పర్‌డ్యు గ్లోబల్‌తో కలిసి పనిచేస్తోంది. 'యూట్యూబ్‌ ప్లేయర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌'లో ఈ కోర్సులు ముందుగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో బీటా వెర్షన్‌లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తర్వాత మరిన్ని దేశాలకు విస్తరిస్తారు. వ్యూయర్స్‌ తమ జనరల్‌ నాలెడ్జ్‌ని పెంచుకునేందుకు ఉపయోగపడే క్విజ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: