రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ఏపీలో కొత్త ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మాటే కానీ, ఉద్యోగార్థుల్లో నిన్న మొన్నటి వరకు గందరగోళం ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా, కొత్తది ఇస్తారా, మళ్లీ టెట్ నిర్వహిస్తారా, పాత పరీక్షతోనే సర్దుకోమంటారా..? కొత్తగా టెట్ పెడితే డీఎస్సీకి గ్యాప్ ఇస్తారా..? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి అధికారులు కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. వాటి ప్రకారం ఉద్యోగార్ధులెవరూ ఆందోళన చెందకుండా సాఫీగా ఈ ప్రక్రియ సాగిపోయే అవకాశాలున్నాయి.

మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ లో అర్హత సాధించనివారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి తేదీల్లో అటుఇటుగా మార్పులు చేసి దరఖాస్తులు స్వీకరించనున్నారు.దీంతో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేయనున్నారు. జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. టెట్‌ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరిగాయి.ఈ పరీక్షలకు 2.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2.35 లక్షల మంది రాశారు. మార్చి 14నే ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు వెల్లడి కాలేదు.

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ రెండు కేటగిరీలుగా విభజించింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌, గిరిజన సంక్షేమం(ఆశ్రమ) పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్‌ 1086, గణితం 726, ఫిజికల్‌ సైన్స్‌ 706, బయోలాజికల్‌ సైన్స్‌ 957, సోషల్‌ స్టడీస్‌ 1368, వ్యాయామ విద్య 1691, ఎస్జీటీ 6,341 పోస్టులున్నాయి. ఏపీ రెసిడెన్షిల్‌ స్కూల్స్‌, మోడల్‌ స్కూల్స్‌, బీసీ, గిరిజన(గరుకులాలు), దివ్యాంగ, జువెనల్‌ విభాగాల్లో 2,281 పోస్టులున్నాయి. వీటిని జోన్ల వారీగా పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోస్టులు 266, జోన్‌-1లో 405, జోన్‌-2లో 355, జోన్‌-3లో 573, జోన్‌-4లో 682 పోస్టులు ఉన్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: