ఆభరణాలంటే ఆడవారు ఎంతో ఇష్టపడుతారు. ఎంత ఇష్టమనేది కొలవడానికి ఏమైనా కొలమానాలుంటే తప్పనిసరిగా 100 కు 200 శాతం ఉంటుంది. అవును మరి ఆభరణాలంటే... అతివలు అంతగా ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాలు జరిగే సందర్భంలో మాత్రమే కాదండోయ్... పెళ్లిళ్లు... పేరంటాళ్లప్పుడూ ఆడవాళ్లు కొత్త కొత్త మోడళ్ల నగలు, నట్రాతో అందంగా ముస్తాబు అవుతారు. అందరిలో తమ ప్రత్యేకతను హుందాతనాన్ని చూపించుకోవాలనుకుంటారు. అంతేకాదు మగువలు నగలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారంటే రోజుకోరకమైన ఆభరణాలను ధరించేంతగా.... వీటినే "ఏడువారాల నగలు" అంటారు. 


మార్కెట్ ట్రెండ్ మారినా ఈ ఏడువారాల నగలకు మాత్రం ఆదరణ తగ్గదు. తరతరాలుగా వీటికి ఆదరణ పెరుగుతూనే ఉంది. ఏడువారాల నగలను గురించి పురాణాల్లోనూ ప్రస్తావించినట్లు ఆధారాలున్నాయి.
ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ఏడు వారాల నగలను గురించి ఆసక్తికరమైన విషయాలు... ఇవిగో... ప్రతి ఒక్క మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు...


 - వారాన్ని అనుసరించి గ్రహ స్థితిని బట్టి ఎటువంటి నగలు... ఏ రోజు ధరించాలి అనే విషయాలు మన పూర్వీకులు పురాణాల ద్వారా చెప్పారు. అవి... ఆదివారం: కెంపుతో తయారు చేసిన నగలు, హారాలు, కమ్మలు, సోమవారం : ముత్యాల హారాలు, ముత్యాల గాజులు, మంగళవారం: పగడాలతో చేసిన నగలు , బుధవారం: పచ్చల హారాలు, గాజులు, గురువారం: పుష్యరాగంతో చేసిన కమ్మలు, ఉంగరాలు, శుక్రవారం: వజ్రాల హారాలు, ముక్కుపుడక, శనివారం: నీలాల నగలు.

ఈరోజున... ఈ నగలే ఎందుకు ధరించాలంటే....?

"ఆదివారం" సూర్యు భగవానునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు కెంపుతో తయారు చేసిన నగలు, హారాలు, కమ్మలను ధరించాలి.

-"సోమవారం" చంద్రునికి ఇష్టమైన రోజు. ఆ రోజున ముత్యాల హారాలు, ముత్యాల గాజులతో అలంకరించుకుంటారు.

-"మంగళవారం" కుజుడికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు పగడాలతో చేసిన నగలను ధరిస్తారు.

-"బుధవారం" బుధుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చల హారాలు, గాజులు వేసుకుంటారు.

-"గురువారం" నాడు బృహస్పతికి ఇష్టమైన రోజు. అందుకే గురువారం రోజు పుష్యరాగంతో చేసిన కమ్మలు, ఉంగరాలు ధరిస్తారు.

-"శుక్రవారం" శుక్రుడికి ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వజ్రాల హారాలు, ముక్కుపుడక ధరించి లక్ష్మీదేవిలా దర్శనమిస్తారు.

-" శనివారం" శనిదేవునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున ఆయనకిష్టమైన నీలాల నగలను ధరిస్తారు. నీలంతో చేసిన కమ్మలు, ముక్కుపుడక పెట్టుకుంటారు.

 ఒక్కోరోజు ఒక్కో రత్నంతో చేసిన నగలను ధరించేవారు అప్పటితరం ఆడవారు. అలాకాకుండా మొత్తం నవరత్నాలతో కమ్మలు, ముక్కుపుడక, హారం, పాపిడిబిళ్ల, వంకీలు... చంద్రహారం, లోలాకులు... ఇలా పలు రకాల డిజైన్ల లో నగలు చేయించుకునేవారు అప్పటి తరం అతివలు.
 నేటితరం లోనూ అదే ట్రెండ్ ఇమిటేషన్ జ్యువెలరీస్ రూపంలో కొనసాగుతున్నది. ఎన్ని రకాల ఆభరణాలున్నా... ఏడువారాల నగలకు ఏ రకమైన ఆభరణాలు సాటి రావు. ఎన్ని నగలున్నా... మిగతావన్నీ సున్నా అంటున్నారు మగువలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: