
బంగారం కొనడం మన ఇండియాలో సర్వసాధారణం. సామాన్యులు గొప్పోళ్ళు అనే తేడా లేకుండా అందరూ గోల్డ్ కొంటూ ఉంటారు. అయితే గోల్డ్ లో ఉండే రకాలు, క్వాలిటీ విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. మనం 22 క్యారెట్లు, 24 క్యారెట్లు అని రోజూ వింటూ ఉంటాము. కానీ అసలు అదేంటి ? వాటి మధ్య తేడా ఏంటి ? అనే విషయం గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బంగారం కొనాలనుకునే వాళ్ళు, బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ తేడాను తెలుసుకోవాలి.
24 క్యారెట్లు అంటే ?
24 క్యారెట్లు అంటే దాదాపు 100 శాతం స్వచ్ఛమైనది అని అర్థం. కానీ సాధారణంగా ఇది 99.99 శాతం స్వచ్ఛమైనదిగా పరిగణించ బడుతుంది. బంగారం పెళుసుగా ఉంటుంది. 100 శాతం స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలు చేస్తే విరిగిపోతాయి. కాబట్టి ఆభరణాలను తయారు చేయడానికి పూర్తిగా స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించలేరు. ఆభరణాలు విరిగిపోకుండా ఉండడానికి బంగారాన్ని రాగి లేదా మరే ఇతర లోహంతోనైనా కలుపుతారు.
22 క్యారెట్లు అంటే ?
22 క్యారెట్ల బంగారం అంటే 91.6 శాతం స్వచ్ఛమైనది. చాలా దేశాలలో 18 క్యారెట్లు, 12 క్యారెట్లతో సహా తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తుంటారు. అతి తక్కువగా అంటే 8 క్యారెట్ల వరకు ఉంటుంది. మీరు ఆభరణాలను కొనుగోలు చేయాలంటే అది 22 క్యారెట్లు అయ్యి ఉండాలి. మీరు బంగారు నాణేలు, బంగారు కడ్డీలను కొనుగోలు చేస్తుంటే అది 24 క్యారెట్లు అయ్యి ఉండాలి. పెట్టుబడిదారులైతే గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లను కొనుగోలు చేయాలి.