డ‌యేరియా.. ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. డ‌యోరియా విజృంభిస్తుంది. ఎవ‌క్కువ‌గా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్ర‌బ‌లుతుంది. ఏటా ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంటుంది. కలుషిత నీరు, ఆహారం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు 3.5 లక్షల మంది నీళ్ల విరేచనాల (డయేరియా) బారినపడుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో సుమారు 13 శాతం దీనికారణంగానే చోటుచేసుకుంటున్నాయి. డయేరియా సోకడానికి అనేక రకాల సూక్ష్మక్రిములు కారణమైనా.. ప్రధానంగా ‘రోటా వైరస్‌’ వల్ల సోకే డయేరియా ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణులు గుర్తించారు. 


ఇప్పుడు ఈ మ‌హ‌మ్మారిని మ‌ట్టుబెట్టేందుకు ప్ర‌భుత్వం తొలిసారిగా ప్ర‌భుత్వ వైద్యంలో టీకా ప్ర‌వేశ‌పెడుతోంది. అయితే.. విరేచనాల బారినపడి ద‌వాఖాన‌ల్లో చేరే చిన్నారుల్లో దాదాపు 40 శాతం మంది పిల్లలు రోటా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌తోనే బాధపడుతుండటం గ‌మ‌నార్హం. ఈ వైరస్‌ కారణంగా వచ్చే డయేరియాను నివారించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 96 దేశాల్లో ఇప్పటికే సార్వత్రిక రోగ నిరోధక టీకాల అమలు ప్రక్రియలో ‘రోటా వైరస్‌ వ్యాక్సిన్‌(ఆర్‌వీవీ)’ను అమలు చేస్తుండగా.. భారత్‌లోనూ కొన్నేళ్లుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలు చేస్తున్న విష‌యం తెలిసిందే. 


తాజాగా ప్రభుత్వ వైద్యంలోనూ ఉచితంగా రోటా వైరస్‌ టీకాకు సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనూ తొలిసారిగా ప్రభుత్వ వైద్యంలో డయేరియా నివారణ టీకాను సెప్టెంబ‌ర్‌ తొలివారంలో ప్రవేశపెట్టడానికి వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. వారం రోజులుగా వైద్య సిబ్బందికి ఈ టీకా ఇచ్చే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. వచ్చే 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా డయేరియా టీకాను రాష్ట్రంలో ప్రారంభించాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. రోటా వైరస్‌ ముఖ్య లక్షణాల్లో  తీవ్ర నీళ్ల విరేచనాలు.. జ్వరం, వాంతులు.. కడుపునొప్పి ఉంటాయి.  


టీకాను ఇప్పించడం.. తరచూ చేతులు కడుక్కోవడం.. శుభ్రమైన నీటిని తాగడం.. సురక్షిత ఆహారాన్ని తీసుకోవడం.. ఆర్నెల్ల వరకూ తల్లిపాలు పట్టడం.. విటమిన్‌ ఎ ఆహారాన్ని ఇవ్వడం వ‌ల్ల డ‌యోరియా బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చున‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. అయితే.. శిశువుకు 6..10..14 వారాల వయస్సున్నప్పుడు ఇతర టీకాలతో పాటు రోటా వైరస్‌ టీకాను వైద్య‌సిబ్బంది వేస్తారు.  2.5 ఎం.ఎల్‌ టీకా ద్రావణాన్ని సిరంజి ద్వారా శిశువుకు వేస్తార‌ని, ఈ టీకాకు బూస్టర్‌ డోసు అవసరం లేదని, కేవలం మూడు మోతాదులు సరిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: