పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ హౌస్ లు ఏర్పడుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో రకరకాల రుచులతో వండిపెడుతూ యాజమాన్యం వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తోంది. కానీ చాలా హోటళ్లు, రెస్టారెంట్లు కుళ్లిపోయిన, రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తున్నాయి. 
 
అధికారుల తనిఖీల్లో పాడైన కూరలు, అపరిశుభ్రంగా నిల్వ ఉంచిన ఆహారపదార్థాలు, కుళ్లిన ఆహార పదార్థాలు ప్రజలకు పెడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది తనిఖీలు చేసి పాడైన చికెన్ లెగ్ పీసులను స్వాధీనం చేసుకున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లలో ఎక్కువగా పాడైన చికెన్ లెగ్ పీసులు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 
 
అధికారుల తనిఖీల్లో చాలా హోటళ్లలో వండిన మాంసం మిగిలితే ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి వేడి చేసి వినియోగదారులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాంసం వేడిగా ఉండటం వలన వినియోగదారులు ఆహార పదార్థాల రుచిని గుర్తించలేకపోతున్నారని సమాచారం. అధికారులు తనిఖీలు చేసి హోటళ్లకు, రెస్టారెంట్లకు జరిమానా విధిస్తున్నా హోటళ్ల, రెస్టారెంట్ల యాజమాన్యాలు మారటం లేదు. 
 
ఆహారం కల్తీ జరిగిందని తెలిసినా చాలా ప్రాంతాలలో ల్యాబ్ సౌకర్యం లేకపోవటంతో కల్తీ జరిగినా నిర్ధారించలేని పరిస్థితి నెలకొంది. వినియోగదారులు ఎంచుకునే హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వినియోగదారులు కుళ్లిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అమ్మే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: