అరటి, కమలా ఫలం వంటివి తిన్నాక ఏం చేస్తాం... ఏం చేస్తాం.. తొక్కలు అవతల పారేస్తం.. అంతేగా.. కానీ ఆ తొక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఆ తొక్కల్ని రకరకాలుగా వాడుకోవచ్చు తెలుసా... ఇప్పుడు కమలాఫలం సీజను. ఆ తొక్కల్ని అంగుళం మేర కత్తిరించి... వాటితో దంతాలను రుద్దుకుని చూడండి. తెల్లగా మారతాయి. ముందు ఆ తొక్కలతో పళ్లు రుద్దుకుని తరువాత పేస్టుతో తోముకుంటే చాలు.
కీరదోస తొక్కలు చీమల బెడదను సులువుగా నివారిస్తాయి. చీమలు వచ్చే చోట ఈ తొక్కల్ని ఉంచండి. చీమలు ఔట్.. అరటిపండు తొక్కతో రుద్ది చూడండి. బూట్లు కొత్తవాటిలా కనిపిస్తాయి. రకరకాల కూరగాయల తొక్కల్ని పారేయకండి. ఓ గిన్నెలో ముప్పావువంతు నీళ్లు తీసుకుని... ఆ తొక్కల్ని ఇందులో వేసి పొయ్యిమీద పెట్టండి.
కాసేపయ్యాక కొద్దిగా ఉప్పు, అల్లంతరుగు, కొన్ని లవంగాలు, దాల్చినచెక్క ముక్క వేయాలి. ఆ నీళ్లు చిక్కగా అయ్యాక తీసుకుంటే.. వెజిటబుల్ స్టాక్ సిద్ధమైనట్లే. దీన్ని సూప్‌లు, ఇతర పదార్థాల తయారీలో వాడుకోవచ్ఛు.. ఇక యాపిల్ తొక్కను కుండీల్లో ఎరువుగా వేస్తే, మొక్కలకు నైట్రోజన్ అంది... ఆరోగ్యంగా ఉంటాయి.
కాఫీ ఫిల్టర్‌లో కాఫీ డికాషన్ తాలూకు మరకలు పోవాలంటే.. ఫిల్టర్‌లో రెండు నిమ్మతొక్కలు, కొద్దిగా ఉప్పు, చల్లని నీరు పోసి... మూతపెట్టేయండి. కాసేపయ్యాక ఒకసారి కుదిపి కడిగేస్తే చాలు. ఇలా తెలుసుకుంటే తొక్కతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో..!