అన్నం పరబ్రహ్మ స్వరూపం : పూర్వకాలంలో ఈ చద్దన్నం మహాభాగ్యం గా ఉండేది. ఉదయాన్నే రాత్రి మిగిలిన అన్నం లోకి పెరుగు వేసుకొని మనవాళ్ళు తింటూ ఉండేవారు. కానీ ప్రస్తుత కాలం ట్రెండ్ మారిపోయింది.. చద్దన్నం అనగానే వాక్ అనే రోజులు వచ్చేశాయి.. కానీ ఈ చద్దన్నం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలతో పాటు వైద్యులు కూడా చెబుతున్నారు..
చద్దన్నం పులియడం వల్ల అందులో ఐరన్,పొటాషియం, క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు స్థాయి పెరుగుతుంది. ఉదాహరణకు రాత్రి వండిన వందగ్రాముల అన్నంలో 3.4 మిల్లీగ్రాముల ఐరన్ వుంటే అది తెల్లారేసరికి 73.91 మిల్లీగ్రాముల వరకూ పెరుగుతుందట. అంతేకాకుండా విటమిన్ బి 6, విటమిన్ బి12 కూడా అధికంగా లభిస్తాయట. అయితే చద్దన్నం ఉదయమే తినడం వల్ల శరీరం తేలికగా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. శరీరానికి కావలసిన మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
చద్దన్నం తినడం వల్ల వేడి కారణంగా శరీరంలో ఉండే దుష్ఫలితాలను తగ్గించవచ్చు. చద్దన్నం తినడం వల్ల వీటిలో ఉండే పీచు దనం పెరిగి మలబద్ధకం, నీరసం వంటివి తగ్గిపోతాయి. శరీరం ఎక్కువ సేపు ఉత్సాహంగా ఉంటుంది. అంతే కాకుండా శరీరంలోని అలర్జీ కారకాలు, మలినాలు కూడా తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్లు వంటివి కూడా తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారం అని చెప్పవచ్చు.
ఈ చద్దన్నం తినడం వల్ల సన్నగా ఉండే వాళ్ళు లావు అవడానికి, లావుగా ఉండే వాళ్ళు సన్నబడేందుకు కూడా తోడ్పడుతుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని మజ్జిగలో నానబెట్టుకుని ఉదయాన్నే తినడం వల్ల స్థూలకాయులు క్రమంగా బరువు తగ్గుతారు. అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలు పోసి, చిటికెడు పెరుగుతో తోడు వేసుకుంటే,తెల్లారేసరికి తోడన్నం తయారవుతుంది. దీనిని ఉదయాన్నే తినడం వల్ల క్రమంగా బరువు పెరుగుతారు. అయితే ఈ చద్దన్నం ఉదయం ఎనిమిది గంటల లోపు మాత్రమే తినాల్సి ఉంటుంది. ఎక్కువసేపు పులిస్తే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకమీదట అయినా మిగిలిన అన్నాన్ని పడేయకుండా తినడానికి అలవాటు చేసుకోండి..