సాధారణంగా మన పెద్ద వాళ్ళు మనకి ఎప్పుడు చెబుతుంటారు సరైన సమయానికి తిని, నిద్రపోతే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని. అప్పుడు పెద్ద వారు చెప్పిన మాటలను ఇప్పుడు శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. ఎక్కువగా నిద్ర పోయే వారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయని పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లడించారు. ముఖ్యంగా ఎక్కువ సమయం నిద్రపోయే వారికి కరోనా వైరస్ వ్యాపించడం చాలా తక్కువ అని తాజాగా పరిశోధకులు తెలియజేశారు. నిద్రకు, కరోనా తీవ్రతకు మధ్య ఉన్న సంబంధం గురించి ఎనిమిది దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.

గత సంవత్సరం జూలై 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు హెల్త్ వర్కర్ల పై సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర అనారోగ్యాలు ఉన్నవారు ఇతరులతో పోలిస్తే కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో వెల్లడయింది. ఇలాంటి వారిలో కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా, వారు కోలుకోవడానికి కూడా అధిక సమయం పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అదేవిధంగా రాత్రి ఒక గంట అదనంగా నిద్రపోయే వారిలో ఈ వైరస్ ప్రభావం 12 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సాధారణంగా కొంతమంది తరుచు మెలకువలో ఉండటం, గాడ నిద్ర లేకపోవడం, ఇతర నిద్ర సమస్యలు ఉన్నవారిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కోవిడ్-19 రోగులకు సేవలందించిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఆన్‌లైన్‌ సర్వే చేశారు. మొత్తం 2,884 మంది హెల్త్ కేర్ వర్కర్లపై ఈ సర్వే చేశారు. వీరిలో 568 మంది కోవిడ్-19 (Covid-19) బారిన పడ్డారు. వీరిలో రాత్రి ఎక్కువ సమయం గాడంగా నిద్రపోయే వారిలో వైరస్ ప్రభావం 12 శాతం తగ్గిందని, అలాంటి వారిలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు

మరింత సమాచారం తెలుసుకోండి: