కరోణ వైరస్ మహమ్మారి ప్రభావంతో గడిచిన దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా క్షయవ్యాధితో మరణాలు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కోవిడ్ కారణంగా క్షయ నిర్ధారణ, చికిత్సలో ఆటంకం కలగడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు డబ్ల్యుహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది.  క్షయ వ్యాధిపై చేస్తున్న పోరు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీబీ నివారణ, చికిత్స పై శ్రద్ధ చూపాలని ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్వో పిలుపునిచ్చింది. క్షయ వ్యాధిపై జరుగుతున్న పోరులో భాగంగా గత కొన్నేళ్లుగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారి రూపంలో వచ్చి పడిన ఈ పిడుగు ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను తారుమారు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 డబ్ల్యుహెచ్వో నివేదిక ప్రకారంప్రపంచవ్యాప్తంగా 2020లో15 లక్షల మంది   క్షయ రోగులు  ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఈ సంఖ్య 14 లక్షలు గా ఉంది.ప్రమాదకరమైన క్షయవ్యాధి పోరులో భాగంగా 2030నాటికి 90 శాతం మరణాలు, 80 శాతం కేసులను తగ్గించాలని డబ్ల్యూహెచ్వో 2017లో లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటి నుంచి 2020 నాటికి క్షయ వ్యాధి మరణాల్లో దాదాపు 9 శాతం, కేసుల్లో 11 శాతం తగ్గుదల కనిపించింది. కానీ కోవడం వల్ల క్షయ నిర్మూలన ప్రణాళికకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.  ఈ నేపథ్యంలో నిర్మూలన సాధ్యమైన, చికిత్స అందుబాటులో ఉన్న, ప్రాచీనమైన ఈ వ్యాధి తీవ్రత పెరగడం ఆందోళనకరమైన విషయం అని  డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో క్షయ నివారణ, నిర్ధారణ, చికిత్సను అందించడంలో తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

కోవిద్ 19 కంటే ముందు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం క్షయ కేసుల్లో 90 శాతం కేవలం ముప్పై దేశాల్లోనే ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా భారత్, నైజీరియా, దక్షిణాఫ్రికా,వియత్నాం దేశాల్లోనే అత్యధిక మంది క్షయ బారిన పడుతున్నారు. గతేడాది దాదాపు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా వారిలో రెండు లక్షల 14 వేల మంది హెచ్ఐవి రోగులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2021, 2022 సంవత్సరాల్లో క్షయ బాధితులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: