సాధారణంగా కూల్ డ్రింక్ బాటిల్‌లో కాస్త ఖాళీగా ఉండటం మీరు గమనించే ఉంటారు. ఏ కార్బోనేటెడ్ కూల్ డ్రింక్ చూసుకున్నా.. అందులో డ్రింక్ అనేది బాటిల్ మూత వరకు నిండి ఉండదు. అయితే ఇలా తక్కువగా బాటిల్లో డ్రింక్ పోసి, కాస్త ఖాళీ స్పేస్ వదిలేయడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మాములుగా స్ప్రైట్, థమ్సప్ వంటివి ఫ్లేవర్డ్ కార్బోనేటెడ్ వాటర్‌గా తయారవుతాయి. ఇవి మూత తీయగానే బూస్ మని ఒక శబ్దం చేస్తూ బుడగలు సృష్టిస్తుంటాయి. దానికి కారణం ఈ కార్బోరేటెడ్ వాటర్‌ను కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌తో మిక్స్ చేయడమే. ఆ గ్యాస్ అనేది బాటిల్‌లో పట్టడానికి ఫ్లేవర్డ్ డ్రింక్‌ను కాస్త తగ్గించి బాటిల్‌లో పోస్తారు.
అలా కాకుండా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కోసం ఎలాంటి ఖాళీ ఇవ్వకపోతే ఆ బాటిల్ పగిలిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనూ ఖాళీ లేకుంటే బాటిల్ పగిలిపోతుంది. అందుకే తయారీదారులు బాటిల్లో కాస్త గ్యాప్ ఇచ్చి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద డ్రింక్ నింపి వాటిని ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ అలా చేయకుంటే ఎండలో పెట్టినప్పుడు ఇవి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అధికం.
ఇక ఈ కార్బోనేటెడ్ వాటర్‌ను రిఫ్రెషింగ్ డ్రింకుగా తాగడానికి ఉపయోగిస్తారు. సోడాలు, మాక్టైల్స్ వంటి వాటిలో కూడా కార్బోనేటెడ్ వాటర్‌ను విరివిగా వాడతారు. అయితే మాజా, స్లైస్ వంటి ఫ్రూట్-బేస్డ్ డ్రింక్స్‌లో ఈ కార్బోనేటెడ్ వాటర్ ను వాడరు. కాబట్టి అందులో ఖాళీ లేదా గ్యాప్ లేకుండా డ్రింక్ అందిస్తుంటారు.