మన శరీరం ఒక గడియారంలా పనిచేస్తుంది. ఈ గడియారాన్ని 'సర్కేడియన్ రిథమ్' అంటారు. రాత్రి పూట నిద్రపోయి, ఉదయం లేచేటప్పుడు ఈ గడియారం సరిగ్గా పని చేస్తుంది. కానీ, రాత్రి పూట నిద్ర లేకపోతే ఈ జీవ గడియారం గందరగోళానికి గురవుతుంది. దీంతో మన శరీరంలోని చక్కెర స్థాయిలు అదుపు తప్పి, గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా ఇలాంటి అలవాట్లు కొనసాగిస్తే, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ప్రముఖ హార్ట్ సర్జన్ మాట్లాడుతూ "నిద్ర అనేది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం. మన శరీరం ఒక యంత్రంలా నిత్యం పని చేయలేదు. కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలంటే సరిగ్గా నిద్రపోవడం చాలా ముఖ్యం. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
కాబట్టి, ఈ రోజు నుండి నిద్ర అలవాట్లను మార్చుకుని, ఆరోగ్యంగా ఉండండి." అని చెప్పారు.
రాత్రి పూట ఆలస్యంగా పడుకుంటూ, వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోయి ఆ సమయాన్ని సరిచేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది సరైన పద్ధతి కాదు. వీకెండ్స్‌లో ఎక్కువగా నిద్రపోవడం వల్ల మన శరీరంలోని గడియారం మరింత బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
స్లీప్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, ప్రతి రోజూ ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో లేవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మన శరీరం సరిగ్గా పని చేస్తుంది. లేకపోతే ఏకాగ్రత తగ్గుతుంది, బరువు పెరిగే ప్రమాదం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలంగా ఇలాంటి అలవాట్లు కొనసాగిస్తే, మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు కంటి నిండా నిద్రపోవాలి. ఇలా నిద్రపోతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.