అవును, మీరు విన్నది నిజమే. ఒకప్పటితో పోల్చుకుంటే ఇపుడు ఇండియాలో పేగు క్యాన్సర్ కేసులు.. మరీ ముఖ్యంగా కొలన్ క్యాన్సర్‌స్ రేటు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాన్సెట్ సంస్థ తాజాగా 50 దేశాల్లో పరిశోధనలు జరపగా 27 దేశాల్లో 25 నుంచి 49 ఏళ్ల వయసు వారిలో పేగు క్యాన్సర్ కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయని తేలింది. కొలన్ క్యాన్సర్ కేసులు యువతలో ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో సంపన్న దేశాలే ఎక్కువగా ఉండడం కొసమెరుపు. జర్మనీ, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, నార్వే, స్లొవేనియా, న్యూజీలాండ్, స్కాట్లాండ్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, కెనడా, అమెరికా, చిలీ, ఇంగ్లండ్, అర్జెంటీనా, పూర్టోరీకోలలో యువతలో కొలన్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని తేలింది. అయితే తక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్, యుగాండాలు ఉన్నప్పటికీ గత 2 దశాబ్దాలతో పోలిస్తే ఇండియాలో ఇటువంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నమాట.

గ్లోబోకాన్, జాతీయ క్యాన్సర్ ప్రోగ్రామ్ రిపోర్టు ప్రకారం.. మానవుని ఉదార భాగంలో చిన్న, పెద్ద పేగులుంటాయని అందరూ చదువుకునే ఉంటారు. పెద్ద పేగు మన జీర్ణ వ్యవస్థలో కీలకమైన భాగం కాబట్టే రోజూ తినే ఆహారం జీర్ణమయ్యాక, మలినాలు పెద్ద పేగు నుంచే బయటకు వెళ్తాయి. ఇక పెద్ద పేగు చివరి భాగాన్ని కొలన్ అంటారు. ఈ కొలన్ భాగంలో చిన్న చిన్న కణతులు లేదా గడ్డల్లాంటివి ఏర్పడతాయి. వాటినే వైద్య భాషలో పాలిప్స్ అని పిలుస్తారు. ఈ పాలిప్స్ కేన్సరస్ పాలిప్స్‌గా మారడానికి సుమారు 10 ఏళ్లు సమయం పడుతుంది. దీనికి కారణాలేంటనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ, కొన్ని అంశాలు మాత్రం బోవెల్ క్యాన్సర్‌కి కారణాలు కావచ్చని డాక్టర్లు పరిగణిస్తున్నారు.

ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం, పొగ తాగడం, ఊబకాయం(అధిక బరువు), మోతాదుని మించి చిరుతిండ్లు,
ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, జంక్ ఫుడ్, కడుపులో క్యాన్సర్‌ పాలిప్స్ ఏర్పడడం, అనారోగ్యకరమైన జీవన విధానం.. వంటివి ఇటువంటి కోలన్ క్యాన్సర్‌ కి దారితీస్తున్న కారణాలు అని అంటున్నారు. ఇక మహిళలతో పోలిస్తే పురుషులలోనే ఈ రకం క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో ఎక్కువగా కనిపించడానికి వారి జీవన విధానం కూడా ఓ కారణమని అంటున్నారు.

ఇక ఈ వ్యాధి లక్షణాలు విషయానికొచ్చేసరికి...  పేగు క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో కడుపులో ఎప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా... మలంతోపాటు రక్తం పడడం, మలం నలుపురంగుని కలిగి ఉండడం, ఎక్కవసార్లు మలవిసర్జన కావచ్చు, మల విసర్జన తర్వాత కూడా పొట్ట భారంగా ఉండడం, మలబద్దకం వంటి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా విరేచనంతో పాటు మ్యూకస్ అంటే జిగురు ఎక్కువగా పడడం వలన మలం జిగటగా ఉంటుంది. అదే విధంగా పొట్ట కింద భాగంలో నొప్పిగా, ఇబ్బందిగా ఉండడం, ఎప్పుడూ నీరసంగా, దేనిపై ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కాస్త జాగ్రత్త వహించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వలన కొలన్ క్యాన్సర్ ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇటువంటి పేగు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం, క్యాన్సర్ స్క్రీనింగ్‌కు వెళ్లడం మంచిదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: