మన దేశంలోనూ తాజాగా HMPV కలకలం రేగింది. కర్ణాటక, గుజరాత్‌లో ముగ్గురు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ కేసులు దేశంలో మొట్టమొదటివి కావడం గమనార్హం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిఘాలో భాగంగా రెండు కేసులను గుర్తించింది. విశేషమేమిటంటే, ఈ వైరస్ సోకిన పిల్లలు ఎవరూ విదేశాలకు వెళ్లినట్టు సమాచారం లేదు.
2001లో నెదర్లాండ్స్‌లో మొదటిసారిగా గుర్తించబడిన ఈ వైరస్, పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) లాంటిదే. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇది ప్రధానంగా వ్యాపిస్తుంది. అంతేకాదు, వైరస్ సోకిన ఉపరితలాలను తాకడం ద్వారా లేదా వైరస్ సోకిన వ్యక్తితో ప్రత్యక్షంగా కలవడం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
ఈ వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రజలకు ధైర్యం చెప్పారు. HMPV కొత్త వైరస్ కాదని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఇటీవల చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. భారత్‌లో ఈ వైరస్‌కు సంబంధించిన తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఏమీ ఎక్కువగా నమోదు కాలేదని ఆయన వెల్లడించారు.
HMPV ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంతో సహా అనేక దేశాలలో ఇప్పటికే వ్యాప్తిలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది ఇతర దేశాలలోనూ శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమైంది. అయితే, ఈ వైరస్ సాధారణంగా తేలికపాటి లక్షణాలను కలిగిస్తుందని, కాబట్టి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.