దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చైనాలో పుట్టిన మహమ్మారి చాపకింద నీరులా నెమ్మదిగా పాకుతుంది. ఇక మనదేశంలోనూ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక తాజాగా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఏకంగా ఆంక్షలు విధించారు. ఈ జిల్లాలో తమిళనాడు, కేరళ సరిహద్దులు ఉండటం ఊటీ పరిసర ప్రాంతాలు ఉండటంతో టూరిస్టులు ఎక్కువగా వచ్చిపోతుంటారు. దీంతో ప్రజలు, పర్యాటకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆంక్షలు విధించారు .
పర్యాటకులు స్థానికులు మాస్కులు పెట్టుకోవాలని ప్రకటించారు. లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేసుకోవాలని తెలపడంతో పాటూ సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇది చూస్తుంటే కరోనా కేసులు నమోదైన సమయంలోని పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు కూడా దేశంలోని చాలా చోట్ల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే . సంపూర్ణ లాక్ డౌన్ తో పాటూ ఆ తరవాత ఆంక్షలు విధించారు. ఇక ఇప్పుడు మరో మహమ్మారి రావడంతో ఆంక్షలు తప్పడం లేదు. అయితే కరోనా లాంటి డేంజర్ వైరస్ కాదని ఇది ఎప్పటి నుండో ఉందని శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు చెబుతున్నారు .
ఇమ్యునిటీ తక్కువ ఉన్నవారికి చిన్నపిల్లలకు, వృద్ధులకే ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తిస్తోందని చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడినా నాలుగు నుండి వారం రోజుల వరకు కోలుకుంటున్నారని అంటున్నారు. అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందే దీని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీ, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలు అప్రమత్తం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసులు పెరిగితే ఏం చేయాలి అనేదానిపై రివ్యూ మీటింగ్ లు పెట్టారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిర్ణయించారు .