ఈ నేపథ్యంలోనే అసలు దోమలను కట్టడి చేయడం వల్ల ఈ వ్యాధులను అరికట్టాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. ఇందుకోసం కొత్త ప్రయోగానికి సైంటిస్ట్‌లు తెరలేపారు. ఈ క్రమంలోనే ఆడ దోమలకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. అవును, ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో దోమలు కుట్టడం వల్ల విజృంభిస్తోన్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ సరికొత్త ప్రయోగాన్ని షురూ చేశారు. మనుషులను కుట్టి వివిధ వ్యాధులకు కారణం అయ్యే ఆడ దోమల సంఖ్యను తగ్గించేందుకు ఈ ప్రయోగం ప్రయోగించనున్నారని తెలుస్తోంది.
ఇక మనకి తెలుసు.. ఇలాంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఆడ దోమలే ప్రధాన కారణం. ఇందులో భాగంగా ఆడ దోమతో శృంగారం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మగ దోమలతో శృంగారం జరిపిన ఆడ దోమలు చనిపోవడం వల్ల వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. ఇక ఇలాంటి ప్రయోగాలే ఈగల్లో సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. ఈగల వీర్యం విషపూరితం చేయగా.. వాటితో సంభోగం జరిపిన ఆడ ఈగల జీవితకాలం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. అయితే ఈ ప్రయోగం వల్ల మనుషులు, ఇతర జీవులకు ఎలాంటి హానిలేదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే.. ఈ ప్రయోగాన్ని మరింత పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు మాక్వేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.