కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చినట్టు తమ దగ్గర పక్కా అధరాలు ఉన్నాయని, కరోలిన్ లెవిట్ తాజా ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఈ విషయం ట్రంప్ చాలా ఏళ్ల క్రితమే చెప్పినప్పటికీ అందరూ ఆయన మాటలను తోసిపుచ్చారని, కానీ ఆయన చెప్పింది వాస్తవం అని ప్రతిపాదించారు. కాగా దానికి సంబంధించిన సాక్ష్యాలు బైడెన్ హయాంలోనే లభించినప్పటికీ ఆయన ఎందుకనో వాటిని బయట పెట్టలేదని ఆరోపించారు. దాంతో ఈ వ్యాఖ్యలు గ్లోబల్ మీడియాలో చిచ్చు రేపుతున్నాయి.
దారుణమైన ప్రాణనష్టానికి కారణమైన కరోనాని అంత తేలిగ్గా తీసుకోబోమని ట్రంప్ ఆనాడే స్పష్టం చేశారు. అయితే ఆయన తరువాత బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయాన్ని విస్మయించారు. కానీ ట్రంప్ మరలా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో కరోనా విషయంపై ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది. ఇకపోతే ‘కరోనా వైరస్ వ్యాప్తి విషయం తెలిసి కూడా చైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవని, 1917 తర్వాత కనీవినీ ఎరుగని ప్రాణనష్టానికి సంబంధించిన అంశం ఇది’ అని ట్రంప్ అప్పట్లోనే చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఈసారి చైనా ట్రంప్ చేతుల్లోనుండి తప్పించుకోదని విశ్లేషకులు అంటున్నారు. కాగా కరోనా వైరస్ వెలుగులోకి రాకముందు వరకు చైనాతో అమెరికాకు మంచి సత్సంబంధాలు ఉండేవి, ఎప్పుడైతే కోవిడ్-19 విజృంభణ జరిగిందో అప్పటినుండి పరిస్థితుల్ని ఒక్కసారిగా మార్చేసిందని అమెరికా వర్గాలు అంటున్నాయి. మరోవైపు, కరోనా వైరస్ మరణాల సంఖ్య మిగతా దేశాల కంటే, అమెరికాలోనే ఎక్కువగా ఉంటుందని నాడు ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే.