ప్రోస్టేట్ క్యాన్సర్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మగాళ్లని భయపెడుతున్న పెద్ద సమస్య ఇది. కేసులు చాలా వేగంతో పెరుగుతున్నాయి. ఈ వ్యాధిని ముందుగా గుర్తిస్తేనే ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. కానీ చాలా మంది మగవాళ్లు మాత్రం మొదటి సంకేతాలను లైట్ తీసుకుంటున్నారు.

ఇటీవల జరిగిన ఒక అవగాహన కార్యక్రమంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ మోహన వంశీ కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి చెప్పారు. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు.

డాక్టర్ వంశీ ప్రకారం, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే మొదటి లక్షణాల్లో ఒకటి.. తరచుగా మూత్రం రావడం. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. అంతేకాదు, మూత్రం సరిగా రాకపోవడం, మధ్యలో ఆగిపోవడం, మూత్రం ఆపేటప్పుడు నొప్పిగా ఉండటం కూడా జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే ప్రోస్టేట్ గ్రంథిలో ఏదో అడ్డంకి ఉందని అర్థం. అది క్యాన్సర్ కణితి వల్లే కావచ్చు.

ఇంకాస్త ముదిరితే.. విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. క్యాన్సర్ ప్రోస్టేట్ దాటి వేరే భాగాలకు పాకిందని చెప్పడానికి ఇది సంకేతం. మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం కూడా ప్రమాదకరమైన లక్షణమే. వెంటనే డాక్టర్‌ను కలవాలి. కారణం లేకుండా బరువు తగ్గిపోతుంటే కూడా తేలికగా తీసుకోవద్దు. ఇది కూడా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు ఇతర క్యాన్సర్లలోనూ కనిపించే లక్షణమే.

50 ఏళ్లు పైబడిన మగవాళ్లు, కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే తప్పకుండా రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలని డాక్టర్ వంశీ సూచిస్తున్నారు. ముందుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరిపోతుంది. అప్పుడు ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీకు ఈ వార్నింగ్ సైన్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవండి. ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు నిలుపుకోవచ్చు. ఇంకా ప్రెస్టేజ్ హెల్త్ బాగుండేలా ఉండేందుకు తగిన పోషకాహారం రొటీన్ డైట్లో భాగం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం .

మరింత సమాచారం తెలుసుకోండి: