ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం మన ఆహారపు అలవాట్లే అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు నిద్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌లు చెప్పిన ప్రకారం, రాత్రి పడుకునే ముందు వైట్ బ్రెడ్ తో చేసిన శాండ్విచ్ లేదా పిజ్జా లాంటివి తింటే కడుపులో మంట పెరుగుతుంది. ఇవి డైజెస్ట్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాదు, బిర్యానీ, స్వీట్లు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ కూడా రాత్రి పూట అస్సలు మంచివి కావు. ఇవి బరువు పెరగడానికి కూడా కారణమవుతాయి.

ఇంకా చెప్పాలంటే, పడుకునే ముందు ద్రాక్ష, ఆరెంజ్, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్ రవికాంత్ అంటున్నారు. వీటిలో ఉండే యాసిడ్ కడుపులో మంటను పెంచుతుంది. కెఫిన్ ఉండే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి వాటికి రాత్రికి దూరంగా ఉండటం ఉత్తమం. రాత్రి భోజనం 7 గంటలలోపు పూర్తి చేస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి నిద్ర బాగా పడుతుంది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, మంచి నిద్ర కోసం ఈ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం.

పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం చాలా మంచిది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను ప్రోత్సహిస్తుంది. అలాగే, తేలికపాటి ఆహారాలైన సూప్స్, ఉడికించిన కూరగాయలు, పెరుగు వంటివి రాత్రి భోజనంలో తీసుకోవచ్చు. ఇవి జీర్ణం కావడానికి తేలికగా ఉంటాయి.

అంతేకాదు, రాత్రి పడుకునే ముందు భారీ భోజనం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. కనీసం పడుకునే రెండు గంటల ముందు రాత్రి భోజనం పూర్తి చేయాలి. పడుకునే ముందు స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తాయి.

శరీరానికి తగినంత నీరు చాలా అవసరం, కానీ రాత్రి పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి, సాయంత్రం 6 గంటల తర్వాత నీళ్లు తక్కువగా తాగడం మంచిది. చివరగా, రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: