నేటి దైనందిత జీవితంలో మారిన జీవనశైలి అనేది పెను ముప్పుగా పరిణమించింది. దాంతోనే అకాల మరణాలు అనేకం సంభవిస్తున్నాయి. ప్రతి ఏటా దేశంలో కొన్ని లక్షల మరణాలు మనం తీసుకొనే ఆహారం వల్లనే నమోదు అవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా యువత చాలా మంది సంతానలేమితో బాధపడుతున్నారు. ముఖ్యంగా సంతాన లోపంతో బాధపడే పురుషుల సంఖ్య ప్రతీ సంవత్సరం గణనీయంగా పెరిగిపోతోంది. అయితే, ఆరోగ్యం బాగుండాలన్నా.. సంతానం కలవాలన్నా పురుషులు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పాలను సాధారణంగా సంపూర్ణ ఆహారంగా మనం పరిగణిస్తాం. ఎందుకంటే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి. అందుకే ఆరోగ్య నిపుణులు సైతం డైట్‌లో పాలను చేర్చుకోమని సూచిస్తుంటారు. అయితే అధిక కొవ్వు ఉన్న పాలు లేదా పాల ఉత్పత్తులను తినడం వల్ల పురుషుల స్పెర్మ్ కౌంట్ కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎందుకంటే? పాల ఉత్పత్తి పెరిగేందుకు కొంతమంది పశువులకు స్టెరాయిడ్స్ వంటివి ఇస్తూ వుంటారు. ఈ పాలను తాగడం ద్వారా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది అని చెబుతున్నారు. కాబట్టి పాల ఉత్పత్తులు పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకోవలసి ఉంటుంది.

అదే విధంగా ప్రాసెస్ చేయబడిన మాంసానికి పురుషులు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ముఖ్యంగా, తండ్రి కావాలనుకున్న పురుషులు ఇప్పటినుంచే ప్రాసెస్ చేయబడిన మాంసం తినడం మానేయడం ఉత్తమం. ప్రాసెస్ చేయబడిన మాంసం తినడం ద్వారా స్పెర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక మద్యపానం, ధూమపానం అనేది టెస్టోస్టెరాన్‌పై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా పురుషుల్లో సంతానలేమి సమస్య తలెత్తవచ్చు. కాబట్టి మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్న పురుషులు వెంటనే దాన్ని మానుకుంటే మంచిది. అదేవిధంగా సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా వున్న క్రీమ్, చీజ్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: