ఖుదీరామ్ బోస్ పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో 1889 డిసెంబర్ 3 న జన్మించాడు. చిన్ననాటనే తల్లిదండ్రులు చనిపోవడంతో తన సోదరి వద్ద పెరిగాడు ఖుదీరామ్. మిడ్నాపూర్ జిల్లాలో అరబిందో, సిస్టర్ నివేదిత వచ్చి చేసిన ప్రసంగాలకు ఆకర్శితుడై దేశం కోసం విప్లవకారుడిగా తయారయ్యాడు. 15 ఏండ్ల వయసులోనే అనుశీలన్ సమితి వాలంటీర్‌గా పనిచేసి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచాడు. దీంతో అప్పుడు బోస్‌ను అరెస్ట్ చేశారు. చీఫ్ జడ్జీ డగ్లాస్ కింగ్‌ఫోర్డ్‌ను హత్య చేసే బాధ్యత 18 ఏండ్ల వయసున్న ఖుదీరాం బోస్, ప్రఫుల్లా చాకీపై ఉంచారు. ఏప్రిల్ 30 న బ్రిడ్జ్ ఆడి ఇంటికి వస్తున్న కింగ్‌ఫోర్డ్‌పై దాడి చేయడానికి బదులుగా పొరపాటున న్యాయవాది కెన్నెడీపై బాంబులు విసిరారు వీరిద్దరూ. ఈ ఘటనలో కెన్నెడీ భార్య మరణించింది.
దీంతో పోలీసులకు దొరక్కుండా పారిపోయారు. తర్వాత ప్రఫుల్లా తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. ఖుదీరాం బోస్ పోలీసులకు దొరికిపోవడంతో ఆయనను విచారించి ఉరిశిక్ష విధించారు. ముజఫ్పర్‌పూర్ జైలులో ఆగస్ట్ 11 న నవ్వుతూ ఉరికంభం ఎక్కాడు ఈ ధీర యువకుడు. ఖుదీరాం బోస్ సేవలకు గుర్తుగా ముజఫ్పర్‌పూర్ జైలుకు ఖుదీరాం బోస్ స్మారక కేంద్ర కారాగారం అని నామకరణం చేశారు. అలాగే, ఆయన పట్టుబడిన రైల్వే స్టేషన్‌ను ఖుదీరాం బోస్ పూసా రైల్వేస్టేషన్‌గా పేరు పెట్టారు. ఇలాంటి ఎందరో వీరులు తెర వెనుకనే ఉండిపోయారు. కాదు, వారి చరిత్రను తెరవెనుకే ఉంచారు కొందరు.