అమెరికాలోని రోడ్ ఐలాండ్ సముద్ర తీరంలో ఈ ఎండీవర్ శిథిలాలను కనిపెట్టారు. దీంతో ఏళ్ల తరబడి తాము పడుతున్న శ్రమకు ప్రతిఫలం దక్కిందని ఆస్ట్రేలియా పరిశోధకులు ప్రకటించారు. అయితే.. ఇలా ఆస్ట్రేలియా పరిశోధకులు ప్రకటించడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాకుండా ఆత్రుతగా ఎందుకు ప్రకటన చేశారని మండిపడుతోంది. ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉందంటోంది అమెరికా.
బ్రిటన్‌కు చెందిన కెప్టెన్ కుక్ 1768-1778 మధ్య కాలంలో పసిఫిక్ మహాసముద్రంలో మూడు చారిత్రక ప్రయాణాలు చేశాడు. ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్ నుంచి బయలుదేరిన ఎండీవర్ నౌక...... దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చాలా ఏళ్లు ప్రయాణించింది. అయితే అది 1778లో రోడ్ ఐలాండ్ వద్ద సముద్రంలో నౌక మునిగిపోయిందని చరిత్ర కారులు అంచనా. ఎండీవర్ మునిగిపోయిందని భావిస్తున్న న్యూపోర్ట్ హార్బర్‌లో 1999 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.
అమెరికా, ఆస్ట్రేలియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించిన నౌక ఎండీవర్ అనే అంటున్నారు. పురావస్తు ఆధారాల ఆధారంగా ఇది ఎండీవర్ అని తేలిందంటున్నారు. ఎండీవర్ నౌక చివరి విశ్రాంతి స్థలం ఇదే అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. 200 ఏళ్ల తర్వాత కూడా ఎండీవర్ నౌకలో 15 శాతం చెక్కుచెదరకుండా ఉందట. ఈ నౌకలో వాడిన కలపను బట్టి.. నౌక తయారీ శైలిని బట్టి ఇది ఎండీవర్ అంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. అమెరికా పరిశోధకులు మాత్రం ఆస్ట్రేలియా పరిశోధకుల ప్రకటన తొందరపాటే అంటున్నారు.