ఈ అనంత విశ్వంలో భూమి ఎంతో అద్భుతమైనది, అరుదైనది, అలాగే ప్రకృతి తనలో ఎన్నో వింతలు, విశేషాలను దాచుకుంటూ ఉంటుంది. ఒక్కసారి ప్రకృతిలో మమేకమైతే మనల్ని మనం మరచిపోయేలా చేస్తుంది. కానీ మనం మాత్రం ఎన్నో ప్రకృతి వింతల్ని, చిత్ర విచిత్ర ప్రదేశాలని వదిలేసి కాలంతో పాటు పరుగులు పెడుతున్నాం. మన దేశంలో ఎన్నో వింతలు అద్భుతాలకు కొదవలేదని చెప్పవచ్చు. అనేక చోట్ల మానవాతీత శక్తులు ఉన్నాయని ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి.


శాస్త్ర, సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మానవ మేధస్సుకు అందని ఎన్నో విషయాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఓ జీవి పుట్టుక, మరణం గురించి ఎవరూ చెప్పలేరు అన్న సంగతి మనకి తెలిసిందే. కానీ ఉత్తరాఖండ్ లోని ప్రాచీన శివాలయంలో జరిగిన ఈ విచిత్ర సంఘటన గురించి మీకు తెలిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఇక్కడ చనిపోయిన మనిషి మళ్లీ ప్రాణం పోసుకుంటాడు. దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లా చౌన్సర్ బావర్ అనే ప్రదేశంలోని లఖమండల్ లో ఓ ప్రాచీన దేవాలయం ఉంది. ఈ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 107 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


చుట్టూ పురాతన ఆలయాల శిధిలాలు, గుహల నడుమ ఉండే ఈ ఆలయంలో సాక్షాత్తు ఆ మహాశివుడు కొలువై ఉన్నాడనేది అక్కడి ప్రజల నమ్మకం. ఈ ఆలయ ప్రధాన ద్వారం వద్ద పశ్చిమం వైపున ఉన్న రెండు భవనాలు ( ద్వార పాలకులు) ఉన్నాయి. ఎవరైనా చనిపోయినా లేక చివరి ఘడియలలో ఉన్న వారిని వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకి తీసుకువస్తారు. వాటి ముందు ఆ మృతదేహాన్ని ఉంచి ఆలయ పూజారి శివలింగాన్ని అభిషేకించిన నీటిని తీసుకువచ్చి.. చనిపోయిన లేదా చివరి ఘడియల్లో ఉన్న వారి శరీరంపై చల్లితే ఆ వ్యక్తి తిరిగి జీవిస్తాడు అనేది ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు.


ఇందుకు సంబంధించి ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు కూడా చూపిస్తారు. ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికిన తరువాత ఆ మహా శివుని పేరుని స్మరిస్తూ గంగాజలాన్ని సేవిస్తారు. గంగాజలం సేవించిన తర్వాత ఆత్మ మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతుంది. అంటే అతను కొన్ని నిమిషాలకు మించి ఎక్కువసేపు జీవించలేడు. ఇలా జరగడం సాధ్యమేనా అంటే.. ఈ ఆలయంలో జరిగే అద్భుతమని అక్కడి వారు చెబుతున్నారు. అంతేకాదు ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల దురదృష్టం పోయి ఎంతో అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. ఈ ఆలయంలో దానవ, మానవ అనే ప్రతిమలు ఉండగా.. ఈ ప్రతిమల వల్లే చనిపోయిన మనుషులు కొన్ని నిమిషాలపాటు తిరిగి బ్రతుకుతారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: