జార్ఖండ్ లోని రత్నగర్భ ప్రాంతంలో స్వర్ణరేఖ అనే నది ప్రవహిస్తుంది. ఈ నది ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. స్వర్ణరేఖ అంటే బంగారపు గీత అని అర్థం. పేరులో ఉన్నట్లుగానే.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది. ఈ స్వర్ణరేఖ నది రాంచీకి నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్డి అనే గ్రామంలోని రాణి చువాన్ అనే ప్రదేశంలో జన్మించి.. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి.. చివరకు బంగాళాఖాతంలో కలుస్తోంది.


అయితే ఈ నదిలోకి బంగారం ఎలా చేరింది..? అనేది మాత్రం ఇప్పటికీ అంతుబట్టని రహస్యమే. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని చేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. ఇక్కడి ప్రజలు ఎంతోమంది జల్లెడలు పట్టుకొని ఆ నది ఒడ్డున బంగారం వేట సాగిస్తూనే ఉన్నారని ఇప్పటికీ చెబుతారు. ఇంతకీ ఈ నదిలోకి ఇంత బంగారం ఎలా చేరిందో తెలియదు కానీ.. శీతాకాలంలోనే ఇక్కడ ఎక్కువగా బంగారం లభిస్తుందట. 


ఈ నది మూడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నప్పటికీ.. నది  ప్రారంభమైన పిస్కో అనే గ్రామంలోనే ఎక్కువగా బంగారం లభిస్తుందట. ఈ కారణం వల్ల ఇక్కడి భూగర్భ జలంలో బంగారు గనులు ఉన్నాయని అనుమానం కూడా ఉందట. నదిలో ఇసుకను ఫిల్టర్ చేసి ఒక్కొక్కటిగా సేకరిస్తారు. అయితే మరీ ఎక్కువగా దొరకవు. ఒక వ్యక్తి ఒక నెలలో 70 నుండి 80 బంగారు రేణువులను సేకరిస్తారు. ఈ బంగారు రేణువుల పరిమాణం బియ్యం గింజంత సైజులో కూడా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

ఇక్కడి గిరిజనులు వర్షాకాలం మినహా ఏడాది పొడవునా ఇదే పనిలో నిమగ్నమై ఉంటారని స్థానికలు అంటున్నారు. వీరు బంగారు రేణువులను దక్కించేందుకు నదిలో ఎంతగానో కష్టపడతారు. అయితే ఒక్కోసారి రోజంతా వెతికినా వీరికి ఒక్క బంగారు రేణువు కూడా దొరకదు. అలాంటప్పుడు వట్టి చేతులతోనే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. బంగారం నది పక్కనే ఉన్నా ఇక్కడి ప్రజల స్థితిగతులు మాత్రమే ఇప్పటికీ ఏమీ మారలేదు. మార్కెట్లో ఒక గ్రాము బంగారం ధర 7వేల దాకా ఉంది. కానీ ఇక్కడ స్థానికులు వారు సేకరించిన బంగారాన్ని చాలా తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అందువల్ల వారి జీవితాల్లో మార్పులేమీ లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: