అనగనగా ఓ అడవిలో చెట్టుక్రింద కలుగులో నివసిస్తూ ఉండేది ఒక ఎలుక. ఒక రోజు సాయంత్రం అది షికారుగా బయటికి వచ్చేసరికి, దూరంగా వలలో చిక్కుకున్న పిల్లి ఒకటి దాని కంట పడింది. ఎలుకకు చాలా సంతోషం వేసింది. దుర్మార్గపు ఈ పిల్లి ఎలుకను తినేందుకు ఎన్ని సార్లు ప్రయత్నించిందో! అట్లాంటి తన శత్రువు వలలో చిక్కుకోవటం చూసి, దాని దగ్గరికెళ్ళి నిలబడి నవ్వుదామనుకొని ముందుకు నడిచింది ఎలుక.
అయితే ఆ సమయానికి అక్కడే దగ్గర్లో ఓ పొదలో పొంచి ఉన్నదొక ముంగిస; ఆ చెట్టు కొమ్మ మీదే కూర్చొని చూస్తున్నది ఒక గుడ్లగూబ! "వేటగాడు వచ్చి వలలో చిక్కిన పిల్లిని ఎట్లాగూ చంపేస్తాడు. అప్పుడు తమకు కొన్ని మాంసపు ముక్కలు దొరక్కపోవు!" అని వేచి చూస్తున్నాయి, అవి. వల దగ్గరికి చేరుకునేవరకూ ముంగిసను, గుడ్లగూబను చూసుకోనేలేదు ఎలుక. తీరా చూసుకునే సరికి బాగా ఆలస్యం అయ్యింది- ఇప్పుడు అది వెనక్కి తిరిగే వీలు లేదు. వెనక్కి తిరగ్గానే ముంగిస మీద పడుతుంది; గుడ్లగూబ తన్నుకు పోతుంది.
ఎలుక ఇరకాటంలో పడిపోయింది. అంతలోనే దానికొక ఉపాయం తట్టింది- "అడవి పిల్లి అంటే ముంగిసకు, గుడ్లగూబకు చాలా భయం. అది వలలో చిక్కి ఉన్నది కనుక ఇవి ఇక్కడ నిలబడి ఉన్నాయిగానీ, ఒకసారి అది వలలోంచి విడివడిందంటే అవి పారిపోకుండా ఉండవు!" అందుకని అది ధైర్యంగా వలలో చిక్కుకున్న పిల్లి దగ్గరికెళ్ళి నిలబడింది. "నన్ను కాపాడు ఎలుకా! ఈ వలను కొరికెయ్యి" అని దాన్ని ప్రార్థించింది వలలో చిక్కినపిల్లి. "సరేలే, ఆగు" అని వలను కొరుకుతు-న్నట్లుగా నటించింది ఎలుక. అక్కడక్కడా కొరికేసరికి వల కొంచెం వదులైంది- కానీ ఎక్కడా పిల్లి పట్టేంత పెద్ద రంధ్రం ఏర్పడలేదు.
పిల్లి అటూ ఇటూ దూకటం మొదలెట్టేసరికి ముంగిస గుడ్లగూబ వెనుకంజ వేసాయి. పిల్లిని-ఎలుకను జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టాయి. ఎలుక వలను కొరుకుతూనే ఉన్నది ఇంకా- అంతలో వేటగాడు అటుగా వచ్చాడు. వేటగాడిని చూడగానే పిల్లి అరిచింది- "వచ్చేశాడు, వచ్చేశాడు! కాపాడు! వలను కొరికెయ్యి- త్వరగా!" అని. అప్పటివరకూ కావాలని ఆలస్యం చేసిన ఎలుక, ఇప్పుడు చటుక్కున వలను పూర్తిగా కొరికేసి, హడావిడిగా తన బొరియవైపుకు పరుగు పెట్టింది. ఒక్క ఉదుటున బయటికి వచ్చింది పిల్లి. ఇప్పుడు అది ప్రాణ భయంతో ఉన్నది- ఎలుకను పట్టించుకొనే సమయం లేదు.
తటాలున అది మరో వైపుకు పరుగు పెట్టింది. వలనుండి విడివడ్డ పిల్లిని చూడగానే గుడ్లగూబ, ముంగిస కూడా తలో దిక్కుకు పారిపోయాయి. ఎలుక సురక్షితంగా బొరియలోకి దూరింది. మరునాడు ఎలుక ఉండే కలుగు దగ్గరికి వచ్చి నిలబడి, "నిన్న నా ప్రాణాలు కాపాడావు-చాలా కృతజ్ఞతలు. నేను, నా భార్యా బిడ్డలు అందరం నీకోసం ఓ చక్కని విందు ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి" అని ఆహ్వానించింది పిల్లి. వెంటనే దాని ఆహ్వానాన్ని తిరస్కరించింది ఎలుక- "పిల్లీ! నువ్వూ నేనూ సహజ శత్రువులం.
మీ జాతినుండి మాకెప్పుడూ ప్రమాదం ఉంటుంది. ఏదో, పరిస్థితులు అలా ఉండటంవల్ల, నిన్న నేను నీకు సాయం చేశాను; నువ్వు నన్ను తినకుండా వదిలిపెట్టావు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు నేను నీ ఎదుట పడితే నువ్వు నన్ను తినకుండా ఉండలేవు. నీ సహజగుణం నీది! నేను నీ ఎదుటికి రాను, క్షమించు" అని మరో అవకాశం ఇవ్వకుండా బొరియ లోపలికి జారుకున్నది.
మరింత సమాచారం తెలుసుకోండి: