ఓరైతు ఓ ముంగీసను పెంచుకొన్నాడు. ముంగిస చాలా తెలివైనదే కాక స్వామిభక్తి కూడా కలిగిన పెంపుడు జంతువు. ఓరోజు రైతు పనిమీద బయటకు వెళ్లాడు. రైతు భార్య పసిబిడ్డకు పాలిచ్చి, నేలమీద పండబెట్టింది. కడవ, పగ్గం తీసుకొని బావినుంచి నీళ్లు తేవడానికని బయలుదేరింది. పోతూ, పాపను చూస్తూవుండమని ముంగిసకు చెప్పి మరీవెళ్లింది.
రైతుభార్య బయటికి పోగానే పుట్టలోంచి ఓ నాగుపాము వచ్చి, ఇంట్లో ప్రవేశించింది. పాప నేలమీద బొంతపై నిద్రపోతూవుంది. పాము పాపవైపు చరచరా పాకుతూ వస్తూవుంది. ముంగిస ఇది పసికట్టి గబాలనున పాముపైకి దుమికింది. పామును ముక్కలు ముక్కలుగా కొరికి పడవేసింది. తలుపు దగ్గిరకు వచ్చి రైతుభార్య రాకకోసం ఎదురు చూస్తూవుంది.
రైతుభార్య రాకకోసం ఎదురుచూస్తూవుంది. రైతుభార్య నీళ్లకడవ చంకన బెట్టుకుని వచ్చింది. వీధి తలుపు బయటవున్న ముంగిసను చూసింది. రక్తం కారుతున్న ముంగిస మూతిని చూసి, అదెక్కడ పసిపాపను కొరికి వేసిందో అని భయపడింది. ఒక్కసారి దుఖం, కోపం ముంచుకొచ్చాయి. ఆమె చంకలోని కడవతీసి ముంగిస తలపై బాదింది. పాపం ! ముంగిస కాస్తా గుటుక్కుమంది.
ఆమె ఇంట్లోకి పరిగెత్తుకు పోయింది. చూస్తే, పాప నేలమీద బొంతపై హాయిగా నిద్రపోతూవుంది. ఆమెకు తన పొరపాటు తెలిసి వచ్చింది. ఆమె ఉన్నపాటున ముంగిసవైపు పరుగెత్తి వెళ్లింది చచ్చిపోయిన ముంగిసను వొళ్లోకి తీసుకొని వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
కాని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం ?
అందుకనే పెద్దలన్నారు. బినా విచారే జో కర్తె, సొ పాఛ్ తాయ్ కామ్ బిగారే ఆపనో, జగ్ మే హోత్ హసాయ్ (ఆలోచించకుండా ఏపనైనా చేస్తే, పశ్చత్తాప పడాల్సి వస్తుంది. మనపని చెడిపోవడమే కాకుండా, పదిమంది మధ్య నవ్వులపాలు కావాల్సి వస్తుంది. కూడా)
ఈ కథలోని నీతి : ఆలోచించక చేస్తే పని నీకు ఎదురవుతుంది శని.
మరింత సమాచారం తెలుసుకోండి: