పనీ పాట లేకుండా అడ్డగాడిదలా ఊరి మీద పడి తిరుగుతున్నావ్.. అని తిడుతుంటాం కానీ, గాడిదలు పనీపాటా లేకుండా ఎప్పుడూ లేవు. ఇప్పుడవి ఎక్కడున్నాయో పట్టుకునేందుకు జనాలే ఊరిమీద పడి తెగ గాలించేస్తున్నారు! ఎందుకంటే గాడిద పాలు చాలా విలువైనవిగా మారిపోవడమే కారణం. 'పాలండీ పాలు. గాడిద పాలు. ఉబ్బసం, నరాల బలహీనత, పచ్చవాతం.. అన్నిటినీ పోగొట్టే పాలు. సర్వరోగ నివారిణి పాలు..' అంటూ విజయనగరం వీధుల్లో అరుస్తూ వెళుతుంటారు. చంటి బిడ్డను ఒళ్లో పెట్టుకుని అతని కోసమే ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. వీధి గుమ్మాల దగ్గర నిల్చున్న కొత్తతరానికి ఈ దృశ్యం అబ్బురంగా ఉంటుంది. పిల్లలేమో 'అయ్..గాడిదలొచ్చాయ్' అంటూ గంతులేస్తారు. పితికిన పాలను బిడ్డకు తాగిస్తే ... చాలా మంచిది అంటుంటారు కొందరు. అదేమీ పట్టించుకోకుండా "పిల్లలు పుట్టగానే గాడిదపాలు పట్టేస్తామండీ.
ఉబ్బసాన్ని డాటర్లే తగ్గించలేక గింజుకుంటన్నారు. గాడిద పాలు పొయ్యమని వారే చెప్పిపంపిస్తున్నారు. అయితే ఈ పాలు కూడా చాలా కాస్ట్‌లీ అవి చిన్న బాటిల్ 25 రూపాయలు ఉంటుంది. అందులో కొద్దిగా వాళ్ళ దగ్గరున్న మందు కలిపి పట్టిస్తే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అంటే 50 రూపాయలు అలా. అది పసిపిల్లలకు పట్టించడం వల్ల ఉబ్బసం, నరాల బలహీనత వంటివి ఎప్పుడూ రాకుండా ఉంటాయి. అదివరకు రోజుల్లో పెద్దవారు ఎక్కువగా చేసేవాళ్ళు. పల్లెల్లో ఎవరికైనా అమ్మ చెప్పిందే వైద్యం ..'' అయితే ఆవు పాల లాగా, గేదె పాల లాగా రోజుకు పదిసార్లు తాగే పాలు కావు ఇవి. జీవిత కాలంలో రెండు మూడుసార్లు తాగిస్తారంతే. అదీ నెలల ప్రాయంలోనే. ఉబ్బసంలాంటి సమస్యలుంటే మాత్రం అప్పుడప్పుడు తాగిస్తారు.
అలాగే ఈ పాలు ఎక్కువగా కూడా తాగించకూడదు అంటారు. చిన్నప్పుడు 3,4 సార్లు పట్టించాలి అంతే అతిగా తాగించినా అందరూ మళ్ళీ గాడిద బుద్దులు వచ్చాయి అంటారు. ఇవన్నీ కూడా ఎక్కువగా అప్పట్లో పెద్దవాళ్ళు పాటించేవారు. నేటి తరం వీటిని కనీసం లెక్క కూడా చెయ్యరు.