సాధారణంగా కొంతమంది పిల్లలు రాత్రి నిద్రలో ఉండగా కలవరించడం, పళ్ళు కొరకడం, అరవడం లాంటివి చేస్తారు. ఈ శబ్దాలు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టి, చికాకు కలిగిస్తాయి.అలాగే తల్లితండ్రులు కూడా పిల్లలకు ఏమయిందో అని కలవరపడతారు. తమ పిల్లలు ఎందుకు ఇలా నిద్రలో పళ్ళు కొరుకుతున్నారో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అసలు పిల్లలు పళ్ళు కొరకడం వెనుక కారణాలు ఏంటో తెలుసా!!
సాధారణంగా పిల్లల్లో పరీక్షల గురించి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలో పళ్ళు కొరుకుతారు. పళ్ళ వరుస ఎగుడు దిగుడు గా ఉండటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు నొప్పికి స్పందించడానికి పిల్లలు పళ్ళు కొరుకుతారు. కొన్ని రకాల వ్యాధులకు వాడే ఔషధాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. నిద్రలో మాట్లాడే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల పళ్ళ పై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. అలాగే ఒక్కోసారి నాలుక, పెదవులు కూడా కొరుక్కునే అవకాశం కూడా ఉంది. ఇంకా విపరీతమైన తలనొప్పి వస్తుంది.
అయితే ఈ సమస్యని దూరం చేయడానికి తల్లి తండ్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.అయితే ఈ సమస్యకు తల్లితండ్రులు ఈ క్రింద తెలుపబడిన చిట్కాలు చేసి చూడండి..పిల్లలకి వెచ్చటి స్నానం చేయించండి. దీనివల్ల రాత్రి పూట హాయిగా నిద్రపోతారు.పిల్లలు ఆడుకుని ఒళ్లునొప్పులు అంటారు. అలాంటపుడు వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది. చక్కని సంగీతం వినిపించడం మరియు పుస్తకాలు చదవడం వంటి స్లీపింగ్ చిట్కాలను అలవాటు చేయాలి.
అధిక కెఫిన్ ఎక్కువగా ఉండే చాక్లెట్స్ కి దూరంగా ఉంచాలి. ఇంకా చూయింగ్ గంమ్ నమలడం వల్ల పిల్లల దవడలు అధికంగా బిగించి ఉండటం వల్ల కూడా నిద్రలో పళ్ళు కొరకవచ్చు. అందుకని చుయింగమ్ లాంటి వాటికీ దూరంగా ఉంచండి. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి వారితో మాట్లాడటం మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి. దీని ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడం వల్ల పళ్ళు కొరికే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.