ఓసారి ఓ సింహం కాలికి పెద్దముల్లు గుచ్చుకుంది. సింహం పళ్లతో కొరికి తియ్యాలని ఎంత ప్రయత్నించినా ముల్లు బయటికిరాలేదు. అది కుంటుతూ కుంటుతూ ఓ గొర్రెల కాపరి వద్దకు వెళ్లింది. సింహం తన వైపు వస్తుండటం చూసి గొర్రెల కాపరి భయంతో గడగడా వణుకసాగాడు. పారిపోయినా సింహం బారినుండి తప్పించుకోలేనని అతనికి అర్థం అయింది. ఏదైనా చెట్టు ఎక్కి ప్రాణాలు రక్షించుకొందామని అనుకున్నాడు.  కాని దగ్గర ఒక్క చెట్టు కూడా కనపడలేదు. మరో దారి లేక అతను కూర్చొన్న చోటే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. సింహం గర్జించనూలేదు. గుర్రుమననూలేదు. మెల్లగా గొర్రెల కాపరివద్దకు వచ్చి అతని ఎదుట కూర్చొంది. ముల్లు గుచ్చుకున్న తన కాలును అతని ముందుకు చాచింది. సింహం తన సాయం కోరి వచ్చిందని గొర్రెల కాపరి తెలుసుకున్నాడు. అతను దానికాలిలోని ముల్లును తీశాడు. సింహం వచ్చిన దారినే చక్కాపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో దొంగతనం జరిగింది. గొర్రెల కాపరి అంటే గిట్టనివాళ్లు కొందరు అతనే దొంగతనం చేశాడని రాజుతో చాడీ చెప్పారు. భుటులు గొర్రెల కాపరిని బంధించారు. కాని దొంగలించబడిన వస్తువులు ఏవీ అతని ఇంట్లో దొరకలేదు, అతను ఆ వస్తువులను మరెక్కడైనా దాచాడేమో అని రాజు భావించాడు. రాజు గొర్రెల కాపరిని సింహనికి ఆహారంగా పంపాడు. గొర్రెల కాపరి భయంతో వణికిపోతున్నాడు. కొద్ది నిమిషాల్లో అతను సింహానికి ఆహారం కాబోతున్నాడు. కాని ఓ విచిత్రం జరిగింది. ఆ సింహం ఒకపుడు అతనిచే కాలిముల్లు తీయించుకొన్నదే! అది తనకు మేలు చేసిన మనిషిని గుర్తుపట్టింది. అది అతని ఎదుట వచ్చి, చుట్టూ తిరుగుతూ తోక అల్లాడిస్తూ అతని పక్కన కూర్చుండిపోయింది. రాజుకు ఆశ్ఛర్యం కలిగింది. రాజు గొర్రెల కాపరిని అడిగి, జరిగిన కథ అంతా తెలుసుకున్నాడు. రాజు అతన్ని విడిచిపెట్టాడు. సింహం లాంటి భయంకర జంతువు కూడా తనకు మేలు చేసిన వ్యక్తిని మరిచిపోలేదు. చేసిన మేలు మరిచిపొయ్యే మనుష్యులు, పశువులు కంటే హీనం.  నీతి : ఎవరూ చేసిన మేలు మరువరాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: