సోమయ్య అనే అతను నరసాపురం అనే ఊర్లో ఓ చిన్న రైతు. అతడికి కొన్ని ఎడ్లు, గేదెలు, మేకలు ఉన్నాయి. ఎడ్లు, గేదెలతో అతడు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. పొలంలో పండిన పంటను బస్తాలలో నింపి... ఎడ్లబండికి గేదెలను కట్టి వాటిద్వారా ఇంటికి చేర్చేవాడు. ఒకరోజు పొలంలో పనేమీ లేకపోవడంతో... ఎడ్లు, గేదెలు, మేకలను తోలుకుని దగ్గర్లోని అడవికి మేతకు తీసుకెళ్లాడు సోమయ్య. దొరకక దొరికిన స్వేచ్చతో... ఎప్పుడూ ఆ పనీ ఈ పనీ చేస్తుండే ఆ జంతువులన్నింటికీ పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆనందంగా గెంతులు వేస్తూ పరుగులెత్తాయి. అన్నింట్లోకి కొంచెం బలంగా ఉండే గేదెకైతే మరీ ఆనందంగా ఉంది. ముళ్ల కంచెల వైపు పోవడం, గడ్డిపూలపై గంతులేయడం లాంటివి చేస్తూ... అన్నింటికంటే ముందు వెళ్ళాలన్న ప్రయత్నంలో వేగంగా పరుగులెత్తింది. మితిమీరిన ఆనందంలో పూర్తిగా ఒళ్లుమరచి పోయిందది. వెనకబడిన వాటిని అదిలిస్తూ... తోలుకొస్తున్న సోమయ్య ఈ గేదె సంగతిని మరచిపోయాడు. గేదె మాత్రం వేగంగా ముందుకు పోసాగింది. అలా వెళ్తుండగా దారిలో ఓ పెద్ద గొయ్యి అడ్డు వచ్చింది. అది ఎప్పుడో పూర్వకాలంలో తవ్విన బావి. నీళ్లు ఎండిపోవడంతో అడవిలోని చెత్తాచెదారం అంతా నిండిపోయి గొయ్యిలాగా తయారయ్యింది. ఆనందంలో కన్నూమిన్నూ కానరాని గేదె ఆ గొయ్యిని గమనించలేదు. కాలిబాట నుంచి కిందికి పరుగులెత్తబోయి, పట్టుదప్పి గోతిలోకి జారి పడబోయింది. ఇంతలో కాస్త ముందుకు వచ్చి పరిస్థితిని గమనించిన సోమయ్య పరుగెత్తుకొచ్చి గోతిలోకి జారిపోబోతున్న గేదె తోకను పట్టుకుని ఆపబోయాడు. అయితే... బాగా బలిష్టంగా ఉన్న ఆ గేదె తోకను పట్టుకున్న సోమయ్య దాని బరువును ఏమాత్రం ఆపలేకపోయాడు. ఫలితంగా గేదె తోక అతడి చేతిలోంచి జారిపోయింది. దాంతో, గేదె పట్టుదప్పి నూతిలో పడిపోయింది. అడవిలో సాయం చేసేవారు ఎవరూ కానరాక పోవడంతో సోమయ్య ఆ గేదెను వదిలేసి మిగతా వాటితో ఇంటిదారి పట్టాడు. కాబట్టి పిల్లలూ...! మితిమీరిన స్వేచ్ఛ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యింది కదూ..!  

మరింత సమాచారం తెలుసుకోండి: