ఇక మొబైల్ కు బానిస కాని పిల్లలు చెట్లు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, సముద్రాలు, నదులు అన్నీ ఎంతో ఉత్సాహంగా, లోతుగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అదే ఇంటర్నెట్ కు అడిక్ట్ అయిన పిల్లలైతే వీటిని అస్సలు ఇష్టపడరు, వీటి లోతుపాతులను అస్సలు చూడకపోగా ప్రకృతి అందాలను వీరు ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు. పిల్లల బుర్ర ఇంకా పూర్తిగా వికసించని ముక్కపచ్చలారని బాల్యంలో మొబైల్ వారిని అనలిటికల్ స్కిల్స్ కు దూరంగా జరిగేలా దుష్ప్రభావం చూపుతుంది.
అయితే మొబైల్ అంటే పంచప్రాణాలుగా భావించే చిన్నారులు ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి అస్సలు తప్పించుకోలేరు. అందుకే భవిష్యత్ తరాల్లో కేవలం సైంటిస్టులు, ఇంజినీర్లు వంటి ప్రొఫెషనల్స్ తప్ప మిగతా కళాకారులు అనేవారే ఉండరేమో అని మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. డిజిటల్ గేమ్స్ ఆడే పిల్లలకు వర్చువల్ వరల్డ్ తప్ప వేరేది ఏదీ వారికి అందంగా కనిపించదు, వారిని ఆకట్టుకోదు. మన ఎగ్జిబిషన్లలో ఉండే బెలూన్ షూటింగ్ వంటి గేమ్స్ ను ఒకసారి వారితో ఆడించండి, మొబైల్ కు అతుక్కుపోయే బాలబాలికలు ఏమాత్రం గురిచూసి బెలూన్లను షూట్ చేయలేరు. అదే సంప్రదాయ ఆటలు ఆడుకునే పిల్లలైతే నాన్ డిజిటల్ గేమ్స్ అయినా దాదాపు గురి పెట్టగలరు. అసలు ఫోన్ వాడకం వలన పిల్లలు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం సమూలంగా మారిపోతుందన్నారు.