
ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ డిజార్డర్ తీవ్రమైన సమస్యగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపింది. గేమింగ్ అలవాట్లు పిల్లల్లో ఎపిలెప్సీ అనే మెదడు సంబంధ అనారోగ్యానికి కారణమవుతోందని ఆ సంస్థ పేర్కొంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించింది. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మూర్ఛలు వచ్చే ప్రమాదాలకు, ఎపిలెప్సీ వ్యాధికి సంబంధం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. కానీ ఫోటోసెన్సిటివ్ ఎపిలెప్సీతో బాధపడుతున్న వ్యక్తుల్లో వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మూర్ఛలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాదు.. ఫ్లాషింగ్ లైట్లు, వైబ్రెంట్ ప్యాటర్న్, కాంట్రాస్టింగ్ వల్ల మూర్ఛలు రావడాన్ని ఫోటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. ఫ్లాషింగ్ లైట్లు, వైబ్రెంట్ ప్యాటర్న్, ఇతర లక్షణాలన్నీ వీడియో గేమ్స్ ఆడేటప్పుడు ఎదురవుతాయి. అంటే ఈ రెండింటికీ సంబంధం ఉన్నట్లు భావించాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రకమైన ఎపిలెప్సీని 'వీడియో గేమ్ ఇండ్యూజ్డ్ సీజర్స్ అంటారు.
అయితే వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మూర్ఛ వస్తే, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఎవరికైనా మూర్ఛ వచ్చినప్పుడు శరీర కండరాలు బిగుతుగా మారుతాయి. మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం, అపస్మారక స్థితిలో ఉండటం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు... వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఒకసారి ప్రారంభమైన మూర్ఛను ఆపలేం. కానీ ఒకవేళ ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు మూర్ఛలు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి.