తాజాగా అమెరికన్ సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. 6 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజూ కనీసం గంట పాటు మితమైన, శక్తివంతమైన శారీరక శ్రమలో పాల్గొనాలని సూచించారు. ఇక సమతుల ఆహారం తీసుకోవడంతోపాటు ఇంట్లో వారి శారీరక శ్రమను పెంచడం ద్వారా పిల్లలను ఆరోగ్యంగా ఉంచవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే పిల్లలు ఊబకాయ బారిన పడకుండా ఉండేందుకు ఈ విషయాలు తెలుసుకోండి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. పిల్లలు టీవీ, మొబైల్ ఫోన్లను చూస్తూ ఆహారం తినకుండా చూసుకోవాలి. ఇక పిల్లల్లో ఊబకాయం పెరుగడానికి ప్రధాన కారణం వారి స్క్రీన్ ఎక్స్‌పోజర్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిల్లలు టీవీ, మొబైల్, కంప్యూటర్‌ను ఎక్కువసేపు వాడటం వలన ఊబకాయం ప్రమాదాన్ని ఎదుర్కొంటారని అన్నారు. ఇక టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోవడం అంటే ఎక్కువ స్నాక్స్ తినడం కూడా ఒక్క కారణం అనే చెప్పాలి. దీనివల్ల అధిక చక్కెర, అధిక కొవ్వు శరీరంలోకి చేరి ఊబకాయానికి కారణమవుతుందని అన్నారు.
అలాగే చిన్న పిల్లల్లో మంచి బుద్ధులు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెబుతున్నారు. ఇక తల్లిదండ్రుల మంచి ఆహారపు అలవాట్లను, ఫిట్‌నెస్ అవగాహనను చూడటం ద్వారా పిల్లలు వాటిని సులభంగా స్వీకరిస్తారని తెలిపారు. అందుకని తల్లిదండ్రులు ముందుగా మంచి అలవాట్లను కలిగివుండటం చాలా అవసరం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హెల్త్ వెల్లడించింది. పిల్లలకు ఆహారంలో పండ్లు, కూరగాయలను ఎక్కువగా అందించాలన్నారు.