చిన్న పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యం. పిల్లల ఎదుగుదలకు, ఆయా శరీర అవయవాలకు కావాల్సిన విటమిన్లు మనం తీసుకునే ఆహారంలోనే ఉంటుంది. సరైన పోషణ లేని ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరంగా దృఢంగా ఉండరు. అందుకే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయాలి. శరీర అవయవాలలో కన్నులు ఎంతో ప్రాధాన్యమైనవి. ఈ ప్రపంచాన్ని చూడాలంటే కన్నులు ఉండాల్సిందే. అందుకే తల్లిదండ్రులు కంటి చూపు మెరుగుపరిచేందుకు తగిన పౌష్టికాహారాన్ని అందజేస్తుండాలి.

ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లకే పరిమితం అవుతున్నారు. వీడియోలు ఆడుతూ.. ఆన్‌లైన్ క్లాసులు వింటూ మొబైల్ ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువ సేవ ఫోన్ డిస్‌ప్లేను చూడటం వల్ల కంటిచూపు మందగించే ప్రమాదం ఉంది. ఈ విషయంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కంటిచూపును మెరుగుపరిచేందుకు పౌష్టికాహారాన్ని అందజేయాలి. అయితే ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం.

క్యారెట్‌...
క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ శరీరానికి అవసరమైన విటమిన్‌-ఏ ను ఉత్పత్తి చేస్తుంది. విటమిన్-ఏ కంటి చూపును మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. అలాగే ఆకుకూరలు, కూరగాయలు కూడా ఆరోగ్యానికి మంచిది. బచ్చలి కూరను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

ఎల్లో ఫ్రూట్స్...
పసుపు రంగులో ఉండే.. మామిడి, జామ, బొప్పాయి, గుమ్మడి కాయలు కంటి చూపు మెరుగుపడేందుకు తోడ్పడతాయి. సహజ సిద్ధంగా పసుపు రంగులో మారే పండ్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. అలాగే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటుంది. ఇది కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది.

సిట్రస్‌ జాతి పండ్లు...
సిట్రస్ జాతికి చెందిన.. నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో విటమిన్‌-సీ పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. అలాగే కళ్లలోని రక్తనాళాలను కూడా శక్తివంతం చేస్తాయి. బాదం, పిస్తా, వాల్‌నట్, సన్‌ఫ్లవర్ గింజలను కూడా ఆహారంగా తీసుకోవాలి. ఇవి కంటిశుక్లం వయసు వంటి మాక్యులర్ డీజనరేషన్ వ్యాధులకు నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: