ఒబేసిటీ.. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య. శారీరక శ్రమ రోజురోజుకూ తగ్గిపోతుండటం... కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం ద్వారా ఈ సమస్య వస్తుంటుంది. మరి బరువు పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవడం ఎలా..?
బరువు కంట్రోల్లో ఉండాలంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వారానికి ఐదు రోజుల వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు. వ్యాయామానికి సరిపోయే ఆహారమూ ముఖ్యమే. వ్యాయామానికి ముందు, తరువాత తీసుకునే ఆహారం సరైనది కాకపోతే సత్ఫలితాలు అందవు.
వ్యాయామానికి అరగంట ముందు ఒక అరటి పండు లేదా రెండు ఖర్జూరాలు తీసుకుంటే సరిపడా శక్తి వస్తుంది. అలసట ఉండదు. వ్యాయామం చేసేప్పుడు మధ్యలో కొద్దిగా నీళ్లు తాగుతూ ఉండడం వల్ల కూడా అలసట అన్పించదు. ఒక వేళ వ్యాయామ సమయం గంటన్నర కంటే ఎక్కువగా ఉంటే మధ్యలో కూడా ఆహారాన్ని తీసుకోవాలి.
వ్యాయామం తర్వాత ముప్పై నుండి నలభై నిమిషాల లోపు అరటిపండు, పాలతో చేసిన మిల్క్ షేక్ కానీ, బాదాం, ఆక్రోట్ లాంటి గింజలు లేదా కొద్దిగా పండ్లు, పెరుగు వంటివి తీసుకుంటే మంచిది. దీని వల్ల అలసట తగ్గి, శరీరం త్వరగా కోలుకుంటుంది. అలాగే, అరలీటరు నుంచి ముప్పావు లీటరు నీళ్లు తాగితే స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని భర్తీ చేసుకోవచ్చు.