పొట్ట గడవడానికి ఆ 11 ఏళ్ల చిన్నారి అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునే వాడు. రోజులు గడవటానికి కోకో కోకోలాలు, స్టాంపులు అమ్ముకున్నాడు. అయితే ఎవరూ ఊహించలేదు అతడు షేర్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తాడని, లక్షల కోట్లకు అధిపతి అవుతాడని. కాలానికి ఎదురెళ్లి మరి, తన ఆత్మవిశ్వాసంతో ఒక మహా శిఖరంగా ఎదిగాడు. చిన్న వయసులోనే వ్యాపార సామ్రాజ్యంలో సాహసమే పెట్టుబడిగా పెట్టి ఆకాశమంతా ఎదిగిన ఎడ్వర్డ్ వారెన్ బఫెట్ గురించే ఇవాల్టీ మన విశ్వ విజేత పరిచయం.

వ్యాపార సూత్రాలను చిన్నప్పుడు ఒడిసిపట్టుకున్నాడు వారెన్ బఫెట్. వాషింగ్టన్ డీసీలో వారెన్ ప్రాథమిక విద్య చేశాడు. తన తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే బఫెట్ మాత్రం తాత కిరాణా దుకాణంలోని సరుకులు బయట అమ్మి రోజు ఖర్చులకు సంపాదించేవాడు. అంతేకాదు ఆ వయసులోనే 25 డాలర్లకు పిన్ బాల్ యంత్రాన్ని కొని, దానిని జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అమ్మి డబ్బులు సంపాదించేవాడు. పదకొండేళ్ళ వయసులోనే తన దగ్గరున్న డబ్బులతో తన కోసం, తన సోదరి కోసం 38 డాలర్లకు కొన్ని కంపెనీ షేర్లను కొన్నాడు. కానీ కొన్న వెంటనే ధర ఇరవై డాలర్లకు పడిపోవటంతో గాబరా పడ్డాడు. కానీ వాటిని నష్టానికి అమ్మకుండా వాటి విలువ 40 డాలర్లకు పెరిగాకే అమ్మేశాడు. బఫెట్ ఆ షేర్లను అమ్మిన తరువాత వాటి విలువ అనూహ్యంగా 200 డాలర్లకు పెరిగాయి. ఈ అనుభవమే బఫెట్ కు తొలి పెట్టుబడి పాఠం అయ్యింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

కాలేజీ రోజుల్లోనే బఫెట్ రోజుకు 150 డాలర్లకుపైగా సంపాదించేవాడు బఫెట్. అతనికి చదువు చెప్పే ప్రొఫసర్లు కూడా అంత సంపాదించేవారు కాదు. ప్రఖ్యాత షేర్ మార్కెట్ నిపుణులు బెన్ గ్రహమ్, డేవిడ్ డాడ్ లు కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారని తెలుసుకొని అందులోనే చేరాలని నిర్ణయించుకొన్నాడు. అక్కడే బఫెన్ జీవితం కొత్త మలుపు తిరిగింది. వారు చెప్పిన పాఠాలు బఫెట్‌కు కొత్త ఆలోచనకు, ఉత్సాహానికి నాంది పలికాయి. షేర్ మార్కెట్ గురించి ఎన్నో విషయాలను నేర్చుకొన్నాడు బఫెట్. అదే సమయంలో తన సోదరి డోరిస్ తో పాటు మరికొంత మంది మిత్రులతో కలసి 1 లక్షా 5వేల డాలర్ల నిధులని సేకరించి, తాను కూడా వంద డాలర్ల పెట్టుబడిగా పెట్టి 1956లో బఫెట్ అసోసియేషన్ లిమిటెడ్ స్థాపించి, తనకున్న వ్యాపార నిపుణతతో 3 ఏళ్లు తిరిగేలోగానే 3 లక్షల డాలర్లు సంపాదించుకోగలిగాడు. అదే సమయంలో నష్టాలలో కూరుకుపోయిన బెర్క్ షిర్ హత్ వే అనే వస్త్ర పరిశ్రమను సొంతం చేసుకొని దానిని లాభాల బాట పట్టించాడు బఫెట్. బెర్క్ షిర్ హత్ వే సంస్థను హస్తగతం చేసుకున్న తర్వాత తన జోరును మరింత పెంచాడు. వ్యాపార రంగంలో రాటు దేలాడు. బెర్క్ షిర్ హత్ వే సంస్థ కంపెనీ ఒక షేర్ విలువ కొన్నప్పుడు 7 డాలర్లు ఉంటే, మరి ఇప్పుడు ఏకంగా 1 కోటి 65 లక్షల రూపాయలు.

అదే ఉత్సాహంతో అనేక కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ, షేర్లు కొంటూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు బఫెట్. కోకకోలా, ద వాషింగ్టన్ పోస్ట్, ఐబీఎమ్, జెట్నెట్, అమెరికాన్ ఎక్స్‌ప్రెస్, ఫిలిప్స్.. వంటి ఎన్నో పెద్ద కంపెనీలలో భారీ మొత్తంలో వాటాలను సొంతం చేసుకున్నాడు. తన బిజినెస్ టాలెంట్‌తో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలను లాభాల బాట పట్టించాడు బఫెట్.
ఈ బిజినెస్ మేన్ తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 60 సంవత్సరాల క్రితం తాను కొన్న ప్రహరీ గోడ కూడా లేని ఇంటిలోనే ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఒక పెద్ద విమానయాన కంపెనీకి అధిపతి అయినా ఇంతవరకు ఏనాడూ సొంత పనులకు వాడింది లేదు. ఇప్పటివరకు తాను సంపాదించిన 99 శాతం ఆస్తిలో తన వయసు 50 సంవత్సరాలు దాటిన తరువాత సంపాదించినదే. తన ఆలోచనలకు ఒక రూపం ఇచ్చి, బఫెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు, ఆస్తిలో అధిక భాగం ఆ ఫౌండేషన్ కు చెందేలా వీలునామా రాసాడు. అంతేకాదు 2006 లో తన ఆస్తిలో 99 శాతం స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చేశాడు.

18 సంవత్సరాలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన బిల్‌గేట్స్ ను వెనక్కి నెట్టి 2008 లో సారిగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకొన్నాడు. 2018 లెక్కల ప్రకారం బఫెట్ ఆస్తి 8250 కోట్ల డాలర్లతో ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచారు. తనకు ఇష్టమై రంగాన్ని ఎంచుకొని, ఆ రంగంలో అత్యున్నత శిఖరంగా ఎదిగి, ఎందరో నిర్భాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపి, ఎందరికో ఆదర్శమయ్యాడు బఫెట్. జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి గెలుపు రుచి కోసం ప్రయత్నించి, విజయ శిఖరాలను చేరుకొన్నాడు. తాను సంపాదించిన ఆస్తిని అంతా సమాజానికే ధారాదత్తం చేసిన ఒక గొప్ప నవయుగ దాన శీలి బఫెట్! అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకొనే స్థాయి నుంచి అదే అమెరికాలో లక్షల కోట్ల వ్యాపార సామ్రాజాన్ని సృష్టించే రేంజ్‌కు ఎదిగాడు. ఆర్థికంగా కుంగిపోతున్న బిజినెస్మేన్లకు గొప్పపాఠంగా మారాడు.