వాట్సాప్ పై నిఘా పెట్టారనే వార్త దేశంలో సంచలనం కలిగిస్తోంది. అయితే దీనివెనుక ఎవరున్నారు? ఎవరి ప్రయోజనాలకోసం ఈ వేట సాగుతోంది..? మన దేశంలో ఎవరిని టార్గెట్ చేశారు? వాట్సాప్‌ లో భారత్‌ కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారంపై నిఘా పెట్టారనే వార్త సంచలనం కలిగించింది. పెగాసస్  స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలుఈ పనిచేశాయని వాట్సాప్ చేసిన ప్రకటన యూజర్స్‌ లో ఆందోళన కలిగించింది.  ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లోని 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని డేటా  చోరీ జరిగినట్లు గుర్తించింది. 


ఇజ్రాయెల్‌ కు చెందిన ఎన్ఎస్‌ వో అనే నిఘా సంస్థ పెగాసస్ అనే  స్పైవేర్‌ ను గుర్తు తెలియని సంస్థలకు అప్పగించింది. దీన్ని ఉపయోగించి, ప్రపంచవ్యాప్తంగా 1,400 మంది దౌత్యాధికారులు, రాజకీయ అసమ్మతివాదులు, జర్నలిస్టులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని వాట్సాప్ తెలిపింది. దీనిపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఎన్ఎస్‌ వో  గ్రూప్పై వాట్సప్ కేసు వేసింది.


అయితే ఈ వార్త వెలువడిన తర్వాత... భారత్‌ లో తామే బాధితులమంటూ కొందరు బయటికొచ్చారు. స్పైవేర్‌ తో నిఘా పెట్టిన వారిలో భీమా కోరెగావ్ కేసులో నిందితుల తరఫున పోరాడుతున్న మానవ హక్కుల న్యాయవాది నిహాల్ సింగ్ రాథోడ్ తో పాటు, ఛత్తీస్ ఘడ్ కు చెందిన కార్యకర్త షాలిని గెరా, బీబీసీ మాజీ జర్నలిస్టు సుభ్రాన్షు చౌదరి, మానవ హక్కుల కార్యకర్త బేలా భాటియా, లాయర్ దిగ్రీ ప్రసాద్ చౌహాన్, ఆనంద్ తెల్తుంబ్డే లాంటి సామాజిక కార్యకర్తలు, జర్నలిస్ట్ సిద్ధాంత్ సిబల్ తదితరులు బాధితులమంటూ ప్రకటించారు. వీరికి ఇప్పటికే సంబంధిత సమాచారం అందిందని తెలుస్తోంది. 


అయితే, ఉగ్రవాద నేరాలపై పోరాడేందుకు గుర్తింపు పొందిన ప్రభుత్వ నిఘా సంస్థలకే ఈ సాంకేతికతను అందజేస్తున్నట్లు ఎన్.ఎస్.ఓ సంస్థ సమర్ధించుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వాట్సాప్ వినియోగదారులుంటే, ఇందులో భారత్ లోనే  40 కోట్ల మంది ఉన్నారు. మెసేజింగ్ యాప్ ఉపయోగించి హాకర్స్ ఈ నిఘా సాఫ్ట్‌ వేర్‌ ను ఫోన్ లు, ఇతర పరికరాల్లో ఇన్స్‌ టాల్‌ చేయగలుగుతున్నారని తేలింది. మేలో సైబర్ అటాక్స్ జరిగినట్టు గుర్తించిన వాట్సాప్, ఆ లోపాలను సరిచేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంది. తమ సిస్టమ్స్‌ కు కొత్త  అప్ డేట్స్ జారీ చేసింది. అయితే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలను నేరస్తులుగా అనుమానిస్తూ మోదీ ప్రభుత్వం చేపట్టిన గూఢాచర్యం తేటతెల్లమయిందని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్నే బాధ్యునిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును కోరింది. అయితే వాట్సాప్‌ లో భారత పౌరుల గోప్యత ఉల్లంఘనపై ప్రభుత్వం ఆందోళనగా ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయులందరి గోప్యతను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: