అమ్మ తొమ్మిది నెలలు మోస్తే..నాన్న పాతికేళ్ళు...రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ..తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న..ఇద్దరి శ్రమ సమానమే అయినా..అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు..
ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ..ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న..ఇద్దరి ప్రేమా సమానమే అయినా..అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు.
ఫోను లోనూ అమ్మ అనే పేరే..దెబ్బ తగిలినప్పుడూ.. అమ్మా అనే పిలుపే..అవసరం వచ్చినప్పుడు తప్ప.. మిగతా అప్పుడు గుర్తు రానందుకు *నాన్న* ఎప్పుడైనా బాధ పడ్డాడా..? అంటే..ఏమో..! ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడం లో...తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు..
అమ్మకి - మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు - బట్టలు..నాన్న బట్టలకు దండెం కూడా నిండదు..! తనని తాను పట్టించుకోవడం రాని నాన్న..ఎందుకో మాక్కూడా పట్టనంత వెనకబడ్డాడు..అమ్మ కి అన్నో కొన్నో బంగారు నగలు..నాన్న కి బంగారు అంచున్న పట్టు పంచె ఒక్కటే..!
కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్నేందుకో బాగా వెనకబడ్డాడు.. పిల్లల ఫీజులు - ఖర్చులున్నాయ్ అన్నప్పుడు..ఈసారి పండక్కి చీర కొనొద్దని అమ్మ..ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే..ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న..ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినా.. మా అమ్మకంటే నాన్న చాలా వెనకబడ్డాడు..
వయసు మళ్ళాకా...అమ్మైతే ఇంట్లో పనికి పనికొస్తుంది.. నాన్న ఎందుకూ పనికి రాడని మేం తీర్మానం చేసేసుకున్నప్పుడు కూడా..వెనకబడింది నాన్నే..! నాన్న ఇలా వెనుకబడి పోవడానికి కారణం..ఆయన మా అందరికీ వెన్నుముక కావడమే..!వెన్నుముక వెనకుండ బట్టే కదాదన్నుగా నిలబడగలుగుతున్నాం..ఇదేనేమో నాన్న వెనుకబడి పోవడానికి కారణం..