అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. నేటి బాలలే రేపటి పౌరులు. వారిని నేడు సంరక్షిస్తే రేపటి దేశం బాగుంటుంది అనేది జవహర్‌లాల్ నెహ్రూ అంతరంగం. నవంబర్ 14వ తేదీన నెహ్రూ పుట్టినరోజు కూడా. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈ విషయాన్ని స్వయంగా నెహ్రూనే తెలియచేశారు.
నవంబర్ 14వ తేదీని నా జన్మదినంగా గుర్తించవద్దనీ, ఆ రోజును "బాలల దినోత్సవం"గా గుర్తించాలని చాచాజీ తెలియచేశారు.
నెహ్రూకు పిల్లలంటే చాల ఇష్టం. నెహ్రూ మన దేశానికి మొదటి ప్రధానమంత్రి. ఆ పదవిలో ఉండేవారికి ఎన్నో బాధ్యతలుంటాయి. తీరిక ఉండదు. కానీ ఆయన మాత్రం అంత పని వత్తిడిలోనూ ఎలాగోలా వీలు చేసుకొని పిల్లలతో మాట్లాడేవారు. పిల్లలంతా ఆయన్ని ప్రేమగా 'చాచా' అని పిలిచేవారు. పసివాళ్లను గులాబీలతో పోల్చిన నెహ్రూ.. అభం శుభం తెలియని బాలలకు బంగారుబాట పరవాలని కలలు కన్నారు.
అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది.
బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పిన మహానుభావుడు మన జవహర్ లాల్ నెహ్రూ. ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే దిశగా పాఠశాలలు పది రోజుల ముందు నుంచే ఈ వేడులను నిర్వహిస్తుంటారు. స్కూళ్లల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, కోలాహలంగా పిల్లలతో
ఆడి, పాడించడం, వ్యాస
రచన, వకృత్వ పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది.