ప్రస్తుత కాలపు మనిషి అద్భుతమైన మేధో శక్తితో అలానే, రకరకాల నూతన ఆవిష్కరణలతో ఎన్నో విధాలుగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకప్పటితో పోలిస్తే ఎన్నో రకాల సాధనాలు నేటి మనిషి పెద్దగా శ్రమ పడనవసరం లేకుండానే అన్ని సౌకర్యాలు తీర్చుకునే స్థాయికి వచ్చాడు. అయితే వాటితో పాటు మనిషిలో ఈర్ష్య, అసూయ, స్వార్ధపు జబ్బులు కూడా రోజురోజుకు మితిమీరుతూ అంచలంచలుగా హెచ్చరిల్లుతున్నాయి. ఒకప్పటి కాలంలో మనలోని వారికి గాని, లేదా మన చుట్టుప్రక్కల వారికి గాని ఏదైనా ఒక సమస్య వస్తే, మిగతా వారు అందరూ కలసి తమవంతుగా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసేవారు, అప్పట్లోనే వారి మనసులు పాల వలే ఎంతో స్వచ్ఛంగా ఉండేవి. అయితే రానురాను ఆ పరిస్థితులకు మనకు మనమే తిలోదకాలు ఇస్తూ వచ్చాము. నేడు ఎవరికి వారే ఎమునా తీరే అనే పరిస్థితికి వచ్చాము. ఒకప్పుడు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, మిగతా చుట్టాలు అందరూ కలిసి మెలిసి ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారం. 

కానీ రాను రాను అవి పూర్తిగా చీలిపోయి ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకునే స్థాయికి వచ్చేసాం. అది కూడా ఎంతలా అంటే, మన అన్నయ్యో లేక అక్కయ్యో మన ప్రక్కనే కనుక మన ప్రక్క వాటాలో ఉంటుంటే, వారిని అంటీ ముట్టనట్లు మ్రొక్కుబడికి పలరిస్తున్నాం, ఎందుకంటే మరింత ఆప్యాయతగా పలకరిస్తే వారు మనల్ని ఎక్కడ డబ్బులు వంటివి సహాయం అడుగుతారేమో అనే భయం మనలో ఏర్పడుతోంది. ఒకప్పుడు ప్రజలు మనది, మనము, మనకు అనే పదాలు ఎక్కువగా వాడేవారని, ఇక నేటి మనిషి, ఆ 'మన' అనే పదంలో 'మ' అనే అక్షరాన్ని పూర్తిగా చిదిమేసి కేవలం 'నా' అనే రెండవ పదమే పరమావధిగా జీవిస్తున్నాడని తత్వ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా జీవితం అనేవి మన అందరిలో పూర్తిగా నాటుకుపోయాయని, దానివల్ల తన, పర అనే బేధాలు మరిచి, మనవారికి ఏదైనా పెద్ద సమస్య వస్తే తృచ్ఛమైన డబ్బు మీద వ్యామోహంతో ఒకప్రక్క వారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. 

ధనార్జన అనేది మనలోని ప్రతి ఒక్కరికి ఉండాలని, అయితే ధనం కోసం ఆశపడడం తప్పులేదని, కానీ అత్యాశ పడితేనే లేనిపోని సమస్యలు వస్తాయని ఎందరో మహానుభావులు ఎన్నో ఏళ్ళ నుండి మనకు బోధిస్తూ వస్తున్నారు. నేటి మన సమాజంలో ఎయిడ్స్ కంటే ప్రమాదకారి అయిన ఈ 'నా' అనే అక్షరం ఎప్పుడైతే రూపు మాపి మళ్ళి పూర్వపు కాలపు స్వచ్ఛమైన మనుషుల వలే 'మన' అంటూ, ఒకరి ఇష్టాన్ని, కష్టాన్ని మరొకరు అర్ధం చేసుకుని వాటిని తీర్చుకుంటూ జీవిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మనిషి జీవనానికి అర్ధం, పరమార్ధం ఉంటుందని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి స్వచ్ఛమైన రోజులు రావాలని, అలానే మనం అందరం ఆ దిశగా మంచి మనసుతో మనవారు అందరిని అర్ధం చేసుకుని కలుపుకు పోతూ, వారి సమస్యలను కూడా పంచుకునేలా జీవిద్దాం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: