ఫిట్‌నెస్ కోసం డ్యాన్స్ చేయడం ద్వారా ఫిట్‌నెస్ ఎలా పొందవచ్చో తెలుసుకుందామా మరి... వేడుకలు, సంతోషకరమైన సందర్భాల్లో మాత్రమే నలుగురు కలిసి చిందేయడం సహజం. కానీ ఇప్పుడు నిత్యం డ్యాన్స్ మంత్రాన్ని జపిస్తోంది నగర యువత. అదే మంటే అదొక ఫిట్‌నెస్ మంత్రగా చెబుతున్నారు. ఇల్లు, కార్యాలయం..పబ్‌లలో సైతం నృత్యంతో కసరత్తు చేస్తున్నారు. యోగా, జిమ్, జాగింగ్, వాకింగ్ లాగే ఇప్పుడు నృత్యం కూడా వ్యాయామ క్రియగా మారిపోయింది.
డ్యాన్స్ తో ఉల్లాసంగా ఫిట్‌నెస్ ఇలా.. అబ్బాయిలు కండలు పెంచడానికి, అమ్మాయిలు అందమైన శరీరాకృతిని సొంతం చేసుకునేందుకు చాలా వ్యాయామశాలలున్నాయి. ఎన్నో వ్యాయామ పద్ధతులూ ఉన్నాయి. కానీ జిమ్‌కెళ్లి బరువులు ఎత్తుతూ, అద్దంలో పదే పదే కండలు చూసుకుంటూ చేయడం బోరింగ్‌గా ఫీలయ్యే వారు...! పార్కులో రోజూ ఏం నడుస్తాం! అనుకునేవారికి ఇప్పుడు డ్యాన్స్ ఫిట్‌నెస్ ఒక మంచి అవకాశంగా కనపడుతోంది.
వ్యాయామం చేయాలనుకునేవారు, డ్యాన్స్‌ను ఇష్టపడేవారు ఎక్కువగా డ్యాన్స్ వ్యాయామాన్ని కోరుకుంటున్నారు. వాస్తవానికి ఈ పద్ధతి వ్యాయామం ఆరేళ్ల నుంచి పరిచయమైనా, ఇటీవల నగర యువత నోళ్లలో నానుతోంది. కార్పొరేట్ ఉద్యోగులు, యువత, కుర్ర కారు డ్యాన్స్ వర్కవుట్లపై మక్కువ చూపు తున్నారు. సహజంగా యూత్ ట్రెండ్లన్నీ పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి చేసుకుంటామనే అపోహ ఉంది. కానీ ఈ డ్యాన్స్ వ్యాయామం మాత్రం పూర్తి గా మన దేశంలో మొదలైన ట్రెండ్. ఇప్పుడు నగరాల్లోని వెస్ట్రన్ డ్యాన్స్ ఇనిస్టి ట్యూట్లన్నీ డ్యాన్స్ వ్యాయామ కేంద్రాలుగా మారాయి.
మీకోసం కొన్ని డ్యాన్స్ వర్కవుట్లు.. బాలీఫిట్‌నెస్, బోక్వా, మసాలా భాంగ్రా, బూట్ క్యాంప్, క్రాస్‌ఫిట్, జుంబా, ఎరోబిక్స్, సల్సా వంటి నృత్యరీతుల్ని ముఖ్యంగా ఫిట్‌నెస్ వర్కవుట్లుగా చేస్తున్నారు.
వీటిలో ఒక్కో నృత్యం ఒక్కో రకంగా ఉంటుంది. పంజాబీ జానపద నృత్యం మసాలా భాంగ్రా. అధికబరువు తగ్గేందుకు, శరీరంలో ఎక్కువ కేలరీలు ఖర్చు అయేందుకు ఇది సరైన వ్యాయామంగా చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.