పిల్లలను పెంచడం ఒక చక్కని బాధ్యత. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఎన్నో ముఖ్య విషయాలు పాటించాలి. పిల్లల పెంపకంలో మరీ కఠినంగా ఉండకుండా ఆడుతూ పాడుతూ జాగ్రత్త పడితే పిల్లలకు మంచి భవిష్యత్ ను అందించిన వారవుతారు. పిల్లల విషయంలో ఎపుడూ పిల్లల దారిలోనే వెళుతూ ఏది మంచో ఏది చెడో చెప్పాలి. ఏ సమయాల్లో ఎలా ఉండాలో చెబుతూనే ప్రేమ, బాధ్యత లాంటి విషయాలను పిల్లలకు తెలియజేయాలి. 
 
పిల్లలకు తగినంత స్వేచ్ఛనిస్తూ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉండటంలో తప్పు లేదు కానీ ఆ ప్రేమ పిల్లలను పాడు చేసే విధంగా ఉండకూడదు. పిల్లల ముందు అనవసరమైన విషయాలను ప్రస్తావించడం ద్వారా ఆ విషయాల ప్రభావం పిల్లల చదువుపై పడుతుందని గుర్తుంచుకోవాలి. ఆడ, మగ పిల్లలుంటే ఇద్దరినీ సమానంగా చూడాలి. ఇద్దరి మధ్య లింగ బేధం ఎప్పుడూ చూపించకూడదు. 
 
తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లలకు ఏమి అవసరమో ఆ అవసరాలకు తగినట్లు దగ్గరుండి చూసుకోవాలి. పిల్లలను వారి పనులను వారే స్వయంగా చేసుకునేలా చేస్తూ పిల్లల్లో ఉండే టాలెంట్ ను ప్రోత్సహించాలి. పిల్లలు చదివేందుకు చక్కటి వాతావరణం కల్పించటంతో పాటు పిల్లలకు కఠినంగా అనిపించే సబ్జెక్టులలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు క్రమశిక్షణ, స్వేచ్ఛ సమపాళ్లలో ఇస్తూ పిల్లలు ఏ తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల గురించి ప్రేమగా చెప్పాలి. పిల్లల పెంపకంలో తగిన జాగ్రత్తలు వహిస్తే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేసిన వారు అవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: